cashew industry : తెరుస్తారా? లేదా?
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:30 PM
cashew industry strike Industrial shutdown పలాస-కాశీబుగ్గ జీడి పరిశ్రమలు 15 రోజులుగా బంద్ నిర్వహిస్తున్నాయి. జీడి పిక్కలు అధిక ధరలు, మార్కెట్‌లో జీడిపప్పునకు మార్కెట్ లేకపోవడం, వ్యాపారుల వద్ద టన్నులకొద్దీ జీడిపప్పు నిల్వ ఉండిపోయిన కారణంగా పలాస క్యాజూ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ గత నెలాఖరు నుంచి పరిశ్రమలను మూసేసింది.

జీడి పరిశ్రమల బంద్‌పై తొలగని సందిగ్ధం
ధర్నాకు సిద్ధంగా కార్మికసంఘ నాయకులు
పలాస, జూన్ 15(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ జీడి పరిశ్రమలు 15 రోజులుగా బంద్ నిర్వహిస్తున్నాయి. జీడి పిక్కలు అధిక ధరలు, మార్కెట్‌లో జీడిపప్పునకు మార్కెట్ లేకపోవడం, వ్యాపారుల వద్ద టన్నులకొద్దీ జీడిపప్పు నిల్వ ఉండిపోయిన కారణంగా పలాస క్యాజూ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ గత నెలాఖరు నుంచి పరిశ్రమలను మూసేసింది. వారిచ్చిన గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘ నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సోమవారం నుంచి పరిశ్రమలు తెరవకపోతే తాము పీసీఎంఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించడంతో జీడి మార్కెట్‌లో ఉత్కంఠ నెలకొంది. బంద్ చేసినా ఇంకా మార్కెట్ గాడిలో పడలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు వారాలు బంద్‌కు అవకాశం ఇస్తే ఆ తర్వాత పనులు కల్పింవచవ్చని వారు చెబుతుండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో 240కిపైగా జీడి పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 10వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తుండగా ఇందులో 95 శాతం మహిళలే ఉన్నారు. ఒక్కో కార్మికురాలు రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకూ వేతనం సంపాదించుకుంటారు. పరిశ్రమలు బంద్ చేయడంతో వారంతా ఉపాధి కోల్పోయారు. వాస్తవానికి జంట పట్టణాల్లో ఇతర కంపెనీలు లేకపోవడంతో కేవలం జీడి పరిశ్రమలపైనే ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. పీలింగ్, కటింగ్, బాయిలింగ్, జీడిపప్పు సైజు వేరుచేయడానికి.. వంటి పనులు కార్మికులు చేస్తుంటారు. ఉదయం 8 నుంచి రాత్రి వరకూ అవిశ్రాంతంగా చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంటారు. ఈ నేపథ్యంలో 15 రోజులపాటు పరిశ్రమలు బంద్ కావడంతో వేలాది మంది కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. నెలలో సగం రోజులు వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చేజారిపోతుండడంతో శుక్రవారం కార్మికసంఘం నాయకులు అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పరిశ్రమలు తక్షణమే తెరిపించాలని వ్యాపారసంఘం నాయకులకు లేఖలు అందించారు. దీనిపై వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. దీంతో సోమవారం పరిశ్రమలు తెరవాలని, లేదంటే వ్యాపారసంఘ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఈ వ్యవహారంపై జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాపారులకు నష్టాలు ఉన్నాయని, తమ సంఘం సభ్యులు మరో రెండు వారాలు గడువు కోరినా అంగీకరించలేదన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నెల 19వ తేదీ నుంచి పరిశ్రమలు తెరిపిస్తామన్నారు.
కార్మిక సంఘం అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ తమకు సమాచారం ఇవ్వకుండానే పరిశ్రమలు బంద్ చేశారని, ఇచ్చిన గడువు 15 రోజుల తరువాత పరిశ్రమలు తెరిపించాల్సిందేనన్నారు. లేకుంటే కార్మికులతో కలసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.