Share News

గతానికి భిన్నంగా..

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:31 AM

Zilla Parishad general meeting చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గతానికి భిన్నంగా ఈసారి అధికార పార్టీ నేతలు సభ్యులకు దీటుగా బదులిచ్చారు.

గతానికి భిన్నంగా..
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, వైసీపీ సభ్యుల తీరును ప్రశ్నిస్తున్న పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌

  • వాడీవేడిగా సాగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

  • లోపాలపై నిలదీసిన పీయూసీ చైర్మన్‌ రవికుమార్‌

  • అడ్డుతగిలిన వైసీసీ జడ్పీటీసీలు, ఎంపీపీలు

  • గతం.. ప్రస్తుత పరిస్థితులపై చర్చించాలని ఎమ్మెల్యేల డిమాండ్‌

  • అడ్డుకున్న టెక్కలి జడ్పీటీసీ.. సొంత పార్టీల సభ్యుల అసంతృప్తి

  • శ్రీకాకుళం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గతానికి భిన్నంగా ఈసారి అధికార పార్టీ నేతలు సభ్యులకు దీటుగా బదులిచ్చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలంతా వైసీపీకి చెందినవారే. దీంతో ఇన్నాళ్లు సమావేశంలో వారిదే హవా. కూటమి ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఈసారి పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌, ఎచ్చెర్ల, పాలకొండ, నరసన్నపేట ఎమ్మెల్యేలు నడుకుదిటి ఈశ్వరరావు, నిమ్మక జయకృష్ణ, బగ్గు రమణ మూర్తితో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హాజరయ్యారు. గతం.. ప్రస్తుత పరిస్థితులపై వైసీపీకి చెందిన సభ్యుల తీరును వారు నిలదీశారు.

  • లోపాలను కడిగిపారేసిన పీయూసీ చైర్మన్‌..

  • పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ ‘స్థానిక సమస్యలపై ప్రస్తావించేందుకు జడ్పీ సర్వసభ్య సమావేశమే వేదిక. 2014-19లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులకు రూ. 1800 కోట్ల బిల్లులను గత ప్రభుత్వం పెండింగ్‌ పెట్టింది. దీనిపై 36వేల కేసులు కోర్టులో ఫైల్‌ అయ్యాయి. కోర్టు ఖర్చులు భరించలేక మరో 20వేల వరకు ఉండిపోయాయి. పనుల బిల్లుల అంశానికి నేనే 139 కేసులు వేశాను. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఆడిట్‌ చేస్తున్న అధికారుల వద్దే ఫైల్స్‌ పెట్టుకుంటున్నారు. వారు సమావేశానికి ఎందుకు రాలేదు? ధాన్యం కొనుగోలులో రైతుల నుంచి మిల్లర్లు 5 నుంచి 8 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. జిల్లాలో రూ.15 కోట్లను రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ వసూలు చేసింది. జిల్లాలో 267 మిల్లులు ఉంటే అన్నిచోట్లా నూకల పేరుతో దోచుకుంటున్నారు. ఎరువులు అందలేదని.. రైతులకు ప్రభుత్వం సమకూర్చలేదని సభ్యులు అంటున్నారు. మరి ఎకరాకు 35 బస్తాల దిగుబడి ఎలా వచ్చింది?’ అని అన్నారు.

  • వైసీపీ సభ్యులపై ఎన్‌ఈఆర్‌ ఆగ్రహం

  • వైసీపీ సభ్యుల వాగ్వాదంలో ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడినట్లు తెలుసుకున్న ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రిని అలా మాట్లాడుతారా? ఇది చాలా తప్పు. చంద్రబాబు, జగన్‌ కాలంలో రైతులకు ఎవరివల్ల మేలు జరిగిందో అధికారులు గణాంకాలు చెప్పాలి. దీనిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటివరకు ప్రతి పనిపై చర్చిస్తే వాస్తవాలు తెలుస్తాయి’ అని ఎన్‌ఈఆర్‌ అన్నారు.

  • పనులకు బిల్లులే చెల్లించలేదు: నిమ్మక జయకృష్ణ

  • పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ‘సభ్యులు కొంతమంది ఇప్పుడు ప్రభుత్వంపై తప్పులు నెడుతున్నారు. 2018-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లింపు చేయలేదు. అప్పటి పనుల బిల్లులు అంశాలు.. వైసీపీ నాటి అంశాలను చర్చించాలి. ఎమ్మెల్యేలను సమావేశంలో మాట్లాడొద్దంటే ఎలా?’ అని ప్రశ్నించారు.

  • అప్పుడు వాకౌట్‌కు కారణమై.. ఇప్పుడు నీతులు

  • గత జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యులంతా వాకౌట్‌ (టీడీపీ జడ్పీటీసీ మినహా) చేసి సమావేశాన్ని జరగనీయకుండా వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ కారణమయ్యారు. పాలకొండలో అధికారుల తీరుతో తనకు అగౌరవమైందని.. ఈ విషయమై తేల్చాలంటూ ప్రస్తావించారు అప్పుడు. మిగిలిన సభ్యులు వంతపాడి చివరకు జడ్పీచైర్మన్‌ సహా వాకౌట్‌ చేసేశారు. ఇప్పుడు వైసీపీ సభ్యులు(జడ్పీటీసీ, ఎంపీసీ) ప్రశ్నలకు బదులిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను .. సభలో వాగ్వాదం జరగకుండా ఆయన సభలో నీతివాక్యాలు చేశారు.

  • అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించి..

  • జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రోడ్డుపనులపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే సభలో ఎమ్మెల్యేలు రవికుమార్‌ మాట్లాడుతున్న సమయంలో కలుగుజేసుకోవడంతో వాగ్వాదమైంది. జగన్‌ హయాంలో రైతులకు మేలు జరిగిందని చెప్పడంతో టీడీపీ ఎమ్మెల్యేలు.. అడ్డుతగిలారు. రాజకీయ ప్రసంగాలు చేస్తామంటే మేము కూడా మాట్లాడతామని బదులిచ్చారు. డ్వామా, పంచాయతీరాజ్‌, పౌరసరఫరా శాఖలకే సర్వసభ్యసమావేశం పరిమితమైంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సభను అర్ధాంతరంగా ముగించేశారు.

  • రైతులకు అన్యాయం జరిగితే కఠినచర్యలు

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘రైతులకు అన్యాయం జరిగితే కఠినచర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఫిర్యాదుచేస్తే తక్షణమే స్పందిస్తాం. ఇప్పటికే జాయింట్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నారు. మిల్లుల వద్ద నిరంతర తనిఖీలు జరిగేలా డిప్యూటీ తహసీల్దార్‌లను పంపుతాం. అక్రమాలకు పాల్పడితే వెంటనే సస్పెన్షన్‌ చేస్తామ’ని తెలిపారు.

  • దువ్వాడ వాణిపై తీరుపై అభ్యంతరం

  • పీయూసీ చైర్మన్‌ కూన రవికుమార్‌, టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న సమయంలో టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి అడ్డు తగిలారు. పోడియం ముందుకు వెళ్లి కూర్చుండిపోయారు. దీంతో సొంతపార్టీకి చెందిన సభ్యులు కూడా ఆమె తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, జడ్పీ సీఈవో సత్యనారాయణ, ప్రభుత్వ శాఖల అధికారులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:31 AM