Share News

Irrigation water resources: అచేతనంగా ఓపెన్‌ హెడ్‌ చానళ్లు..

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:54 PM

Irrigation water resources:ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మహేంద్రతనయా, బాహుదా నదులు ప్రధాన సాగునీటి వనరులు. మరో 200 వరకూ చెరువులు ఉన్నాయి.

Irrigation water resources: అచేతనంగా ఓపెన్‌ హెడ్‌ చానళ్లు..
కొళిగాం వద్ద పిచిమొక్కల మధ్య రాజగాయి చాన

ఇచ్ఛాపురం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మహేంద్రతనయా, బాహుదా నదులు ప్రధాన సాగునీటి వనరులు. మరో 200 వరకూ చెరువులు ఉన్నాయి. పైడిగాం, బాహుదా ఓపెన్‌ హెడ్‌ చానళ్లు 11, వాటి పరిధిలో పదుల సంఖ్యలో గ్రోయిన్లు ఉన్నాయి. సీతసాగరం, పొత్రఖండ-కర్తలిపాలెం సాగరం, గంగాసాగరం, గోవిందసాగరం, సుంకిడి సాగరం వంటి సాగునీటి వనరులు ఉన్నాయి. కానీ, దశాబ్దాలుగా నిర్వహణ సరిగా లేకపోవడంతో ఇవి మూలకు చేరాయి.

బాహుదా నది ఇచ్ఛాపురం మండలానికి ప్రధాన సాగునీటి వనరు. దాదాపు 21 పంచాయతీలకు చెందిన 10 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు. ఈ నదిపై 11 చోట్ల ఓపెన్‌ హెడ్‌ చానళ్లను ఏర్పాటు చేశారు. గ్రోయిన్లను ఏర్పాటుచేసి నీటిని మళ్లిస్తున్నారు. అయితే దాదాపు ఓపెన్‌ హెడ్‌ చానళ్లు, గ్రోయిన్లు దెబ్బతినడంతో రైతులే సొంతంగా డబ్బులు వేసుకొని బాగుచేసుకోవాల్సి వస్తోంది. ఎగువ ప్రాంతంలోని ఒడిశాలో భలగబట్టి ప్రాంతంలో నదిపై ప్రాజెక్టును నిర్మించారు. దీని ఎత్తు 106 మీటర్లుకాగా.. ప్రాజెక్టు నిండనదే కిందకు నీరు విడిచిపెట్టరు. దీనికితోడు ఏపీ భూభాగంలో నదిలో దారుణంగా రెల్లి గెడ్డ ఉంది. చెత్త పేరుకుపోయింది. దీంతో నీటి ప్రవాహ గమనానికి అడ్డంగా మారుతోంది.


పైడిగాం..దయనీయం

మహేంద్రతనయా నదిపై సోంపేట మండలం భాతుపురం సమీపంలో నిర్మించిన పైడిగాం ప్రాజెక్టు 2018లో తితలీ తుఫాన్‌కు కొట్టుకుపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేశారే తప్ప ప్రాజెక్టు నిర్మాణం మాత్రం చేపట్టలేదు. రూ.36 కోట్లతో ప్రాజెక్టును ఆధునీకరించనున్నట్టు ప్రకటించారు. కానీ, పనులకు మాత్రం ఇంతవరకూ మోక్షం లేదు. ఎగువ ప్రాంతంలో పురియాసాయి వద్ద ఒడిశా ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దీంతో 185 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా..కనీసం 40 క్యూసెక్కుల నీరు సైతం చేరడం లేదు. తూర్పు కనుమల నుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేసేందుకు వీలుగా లడ్డగుడ్డి వద్ద మినీ రిజర్వాయర్‌ నిర్మిస్తే.. ఆ నీటిని కాలువలకు మళ్లిస్తే మాత్రం అదనంగా 6 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇచ్ఛాపురం మండలంలో 9,150 ఎకరాల ఆయకటు, కంచిలి మండలంలో 12 వేల ఎకరాలు, సోంపేట మండలంలో 10,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందితేనే వరి పండేది. కానీ ఏటా సకాలంలో సాగునీరు అందక ఇబ్బందికర పరిస్థితులు తప్పడం లేదు. అందుకే ఈ ఏడాది వేసవిలోనే సాగునీటి వనరులకు మరమ్మతులు చేపట్టాలని నియోజకవర్గంలోని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టిసారించాలి

ఇచ్ఛాపురం నియోజకవర్గంపై గత వైసీపీ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఉన్న సాగునీటి వనరులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వాల నుంచి ఎటువంటి కదలిక లేదు. ఏటా ఇదే పరిస్థితి. ఈ ఏడాది కనీస స్థాయిలో ఉభాలు జరగలేదు. కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించాలి. వంశధార జలాలను ఇచ్ఛాపురం నియోజకవర్గానికి తెచ్చేందుకు కృషిచేయాలి.

-కాళ్ల దిలీప్‌, 22వ వార్డు కౌన్సిలర్‌, టీడీపీ నేత, ఇచ్ఛాపురం

Updated Date - Apr 21 , 2025 | 11:54 PM