Arasavalli: ఆదిత్యా.. అవే అవస్థలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:57 PM
Arasavalli Staff behavior అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతుండగా, వారికి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అరసవల్లిలో మారని సిబ్బంది తీరు
కానరాని కనీస సౌకర్యాలు
అపరిశుభ్రంగా ఆలయ పరిసరాలు
ఎండలో భక్తులకు తప్పని ఇబ్బందులు
అరసవల్లి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ భక్తుల తాకిడి పెరుగుతుండగా, వారికి సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిసరాలను పరిశుభ్రం చేయిండచం లేదని, అక్రమ వసూళ్లను సైతం అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం కూడా వేలాది మంది భక్తులు ఆలయానికి రాగా.. ఒక్కరోజే స్వామికి రూ.10,46,523 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.6,38,100, విరాళాల రూపంలో రూ.1,05,828, ప్రసాదాల ద్వారా రూ.2,02,595 ఆదాయం సమకూరింది. కాగా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నీడ సౌకర్యం లేక మండేఎండలో.. క్యూలో నిల్చొని అవస్థలు పడ్డారు.
వసూళ్ల దందా ఆపేదే లేదు
ఆలయ ఆవరణలో సోడా, ఐస్‌క్రీమ్‌లు విక్రయించే చిరు వ్యాపారుల వద్ద ఉద్యోగులు, సిబ్బంది అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే కొబ్బరికాయ కొట్టేచోట ప్రతీ భక్తుడి నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా చూసీచూడనట్టు వదిలేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ పరిసరాలు చెత్తాచెదారాలతో దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆదివారమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు.
గోశాలలో.. గ్రాసానికీ కరువే....
ఆలయానికి సంబంధించిన గోశాలలో మొత్తం 13 గోవులు ఉన్నాయి. వాటికి ప్రతీరోజు గ్రాసం వేస్తుంటారు. నెల ముందుగానే పశువుల గ్రాసం కొనుగోలుకు ఆర్డర్ చేస్తారు. కానీ ఆదివారం నాటి పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. గత నెల ఇచ్చిన పశుగ్రాసం పూర్తికావచ్చింది. ఇంతవరకు గ్రాసానికి సంబంధించి ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోలేదు. ఆ గోవుల ఆకలి సంగతి ఆ ఆదిత్యుడికే తెలియాలి...
పర్యవేక్షణ లోపమే.. శాపమా...
ఆదిత్యుడి ఆలయానికి సంబంధించి 34 సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రతీచోట జరుగుతున్న విషయాలను మోనటరింగ్ రూమ్ నుంచి లేదా ఈవో చాంబర్ నుంచి పరిశీలించే వెసులుబాటు ఉంది. కానీ ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆలయంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆలయంలో పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ సూపరింటెండెంట్ ఎస్.కనకరాజు వద్ద ప్రస్తావించగా.. ‘ఎటువంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతాం. ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించినా.. అక్రమ వసూళ్లకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.