Share News

ఆగని ఆర్తనాదాలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:24 AM

The injured are receiving treatment కార్తీకమాస ఏకాదశి పర్వదినం వేళ.. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల్లో ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో రెయిలింగ్‌ ఊడిపోయి ప్రమాదం జరగ్గా.. తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే మరో 15 మంది గాయపడగా.. వారంతా పలాస, టెక్కలి, జెమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఆగని ఆర్తనాదాలు
పలాస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

  • కాశీబుగ్గలోని తొక్కిసలాట ఘటన బాధితుల్లో కన్నీటిసుడులు

  • ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

  • పలాస/రూరల్‌/కాశీబుగ్గ,నవంబరు2(ఆంధ్రజ్యోతి):

  • కార్తీకమాస ఏకాదశి పర్వదినం వేళ.. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలు, క్షతగాత్రుల్లో ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలో రెయిలింగ్‌ ఊడిపోయి ప్రమాదం జరగ్గా.. తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే మరో 15 మంది గాయపడగా.. వారంతా పలాస, టెక్కలి, జెమ్స్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా.. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులు ఎవరిని కదిపినా.. కన్నీటిసుడులు తిరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు జరిగిన ఆ ఘటనను తలచుకుని విషాదంలో మునిగిపోతున్నారు. ఒకే మార్గంలో అధిక సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగించడంతో తోపులాట జరిగిందని, ఒకరిపై ఒకరు పడడంతో తొక్కిసలాటకు దారితీసిందని బాధితులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు, మెడ, నడుము, పాదాలకు బలమైన గాయాలయ్యాయని, దేవుడి దయతోనే తాము ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొంటున్నారు.

  • ఒక్క ఉదుటన మీదపడ్డారు..

  • కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయానికి మా గ్రామస్థులతో కలిసి వచ్చా. స్వామి దర్శనం కోసం అందరం క్యూలైన్‌లో ఉన్నాం. ఒక్క ఉదుటన భక్తులు మీద పడడంతో నేను కింద పడిపోయా. తరువాత ఏం జరిగిందో నాకు తెలియలేదు. చేతికి, నడుముకు, పాదాలకు దెబ్బలు తగిలాయి. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు. ఇప్పుడు కాస్త తేరుకున్నా.

  • -పిన్నింటి గౌరీ, రామేశ్వరం, టెక్కలి మండలం

  • పెనుగులాటతోనే..

  • ఏకాదశి సందర్భంగా గుడికి వచ్చాను. ఒక్కసారిగా జరిగిన పెనుగులాటతోనే నేను కిందపడిపోయా. గాయపడడంతో నన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతోనే ఈ ప్రమాదం వాటిల్లింది.

  • -సోపాల వెంకటమ్మ, దిమ్మిడిజోల, నందిగాం మండలం

  • ఒకేసారి రాకపోకలు..

  • భక్తులంతా క్యూలో ఉండగా ఎటువంటి తోపులాట జరగలేదు. ఒక్కసారిగా ఇన్‌గేటు, అవుట్‌ గేటు నుంచి ఒకేసారి రాకపోకలు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. భక్తులు నా మీద పడడంతో కిందపడిపోయి గాయపడ్డా. కాలు, నడుముకు దెబ్బలు తగిలాయి. ఆస్పత్రిలో వైద్యం అందించడంతో ప్రస్తుతం బాగానే ఉంది.

  • -దండు భారతి, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం

  • కిందపడి పోయాను..

  • మా గ్రామస్థులతో కలిసి నేను ఆలయానికి వచ్చా. ఆ రోజు ఉపవాసం కారణంగా నాకు నీరసంగా ఉంది. ఇదే సమయంలో తొక్కిసలాట జరిగింది. అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురై కిందపడిపోయా. ఆసుపత్రిలో చేర్చిన తరువాత తెలివి వచ్చింది. కాలికి, మెడకు, వీపులో తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నా. వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

  • -దట్టి ఆదమ్మ, శివరాంపురం, వజ్రపుకొత్తూరు మండలం

  • దేవుడి దయతో బయటపడ్డా

  • తోపులాటకు గురై నాతో పాటు చాలామంది ఒకరిమీద ఒకరు పడ్డారు. కొందరు రైలింగ్‌ను దాటి కిందపడ్డారు. నన్ను తోసుకుంటూ కొందరు భక్తులు వెళ్లడంతో నేను కిందపడ్డా. నా చేతికి బలమైన గాయమైంది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డా.

  • -గున్న చిట్టెమ్మ, నందిగాం

  • ఇప్పటికీ భయమేస్తుంది.

  • ఒకే మార్గంలో భక్తులు రాకపోకలు సాగించారు. దీంతో తోపులాట జరిగి భక్తులు ఒకరిపై ఒకరు పడ్డారు. క్యూలైన్‌లో ఉన్న నేను కూడా కిందపడిపోవడంతో నడుము, చేతులకు బలమైన గాయాలయ్యాయి. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది.

  • -దట్టి కాంతమ్మ, శివరాంపురం, నందిగాం మండలం

  • సరైన రక్షణ వ్యవస్థ లేదు..

  • ఆలయంలో సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడంతోనే తోపులాట జరిగి ప్రమాద తీవ్రత పెరిగింది. ఒకే లైన్‌ నుంచి అఽధిక సంఖ్యలో భక్తులు మీదకు వస్తుండడంతో నేను కిందపడిపోయా. కాలికి తీవ్రమైన దెబ్బ తగిలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా.

  • -గంగాల హరికృష్ణ, ధర్మపురం, ఇచ్ఛాపురం మండలం

  • వణికిపోయాను..

  • నేను ఆలయానికి వచ్చేసరికే అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరి ఉన్నారు. సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డా. తొక్కిసలాట జరిగి నా పక్కన ఉన్నవారు మృతి చెందడంతో నేను వణికిపోయా. నా కాలికి తీవ్రగాయమైంది. ఆసుపత్రిలో కోలుకుంటున్నా.

  • -రోణంకి రమాదేవి, తేలినీలాపురం, టెక్కలి మండలం

  • కదలలేకపోయాను..

  • క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా పైపైకి రావడంతో తొక్కిసలాట జరిగింది. నేను ఎటూ కదలలేకపోయా. కిందపడడంతో కాలు, చేతులకు బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నా.

  • -పిన్నింటి నాగమ్మ, రామేశ్వరం, టెక్కలి మండలం

  • భక్తుల తాకిడితోనే..

  • భక్తుల తాకిడితోనే తోపులాట చోటుచేసుకుంది. భక్తులు గుంపుగా మీదకువచ్చి పడడంతో నా కాళ్లకు దెబ్బలు తగిలాయి. ఆసుపత్రిలో చేరిన తరువాత వైద్యులు చికిత్స అందజేశారు. ప్రస్తుతం బాగానే ఉంది.

  • -బొడ్డపాడు పుష్ప, చినహంస, మెళియాపుట్టి మండలం

Updated Date - Nov 03 , 2025 | 12:24 AM