Share News

Private teachers: అడ్మిషన్లకు తిరగలేక.. డీఎస్సీకి చదవలేక

ABN , Publish Date - Apr 29 , 2025 | 10:49 PM

Private teachers:ఐదేళ్లుగా ఉద్యోగార్థులు ఆశగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.

   Private teachers: అడ్మిషన్లకు తిరగలేక.. డీఎస్సీకి చదవలేక

- ప్రైవేట్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సతమతం

- పిల్లలను స్కూళ్లల్లో చేర్పించాలని యాజమాన్యాల ఒత్తిడి

- డీఎస్సీ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టలేకపోతున్న వైనం

- ఉద్యోగం వదిలేద్దామంటే తరువాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లుగా ఉద్యోగార్థులు ఆశగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అభ్యర్థులు డీఎస్సీ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోన్నారు. కొందరు కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటుంటే, మరికొందరు ఇంటి వద్దనే ఉండి చదువుతున్నారు. అయితే, డీఈడీ, బీఈడీ పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో టీచర్లు, అధ్యాపకులుగా పని చేస్తున్న కొందరు అభ్యర్థులు మాత్రం అడ్మిషన్ల పేరుతో గ్రామాల్లో తిరుగుతున్నారు.


అడ్మిషన్ల పేరుతో సంబంధిత సూళ్ల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తుండడంతో వారు సతమతవుతున్నారు. జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. అంటే పరీక్షల ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల రోజులు ఇంటి వద్ద ఉండి చదువుకోవాలని అనుకుంటున్న తమకు కుదరడం లేదని ప్రైవేట్‌ టీచర్లు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 450 వరకు ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పని చేస్తున్న ఉపాధ్యాయులపై అడ్మిషన్ల ఒత్తిడి ఉండడంతో ఏమిచేయాలో తెలియడం లేదని అంటున్నారు. పోని ప్రైవేటు ఉద్యోగం వదలేసి చదవుకుందామంటే, డీఎస్సీ రాకుంటే తరువాత పరిస్థితి ఏమిటనే సందిగ్ధంలో ఉన్నారు. వచ్చేఏడాది విద్యాసంవత్సరంలో టీచర్‌గా కొనసాగాలంటే వేసవి సెలవుల్లో అడ్మిషన్లు తీసుకురావాలని సంస్థలు టార్గెట్‌ పెడుతున్నాయి. అలా తెచ్చిన వారికి కొన్ని సంస్థలు పూర్తిస్థాయి జీతాలు ఇస్తుండగా, మరికొన్ని సంస్థలు మాత్రం సగం జీతాలు మాత్రమే ఇస్తున్నాయి. అడ్మిషన్‌కు తిరగని వారి విషయంలో స్కూళ్ల రీ ఓపెన్‌ సమయంలో విద్యాసంస్థలు తీసుకున్న నిర్ణయమే శిరోధార్యం.


ప్రిపరేషన్‌కు అవకాశం ఇవ్వాలి

డీఎస్సీ అనేది నిరుద్యోగ యువతకు ఒక వరం. రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రతిఒక్క అభ్యర్థి ప్రిపరేషన్‌ కావాలని కోరుకుంటారు. కానీ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కొందరు అభ్యర్థులు మాత్రం అడ్మిషన్ల కోసం తిరగాల్సి వస్తుంది. వారు డీఎస్సీకి చదువుకునేలా మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇవ్వాలి.

-జోగి తిరుపతిరావు, జువాలజీ అధ్యాపకుడు, ఓ ప్రైవేట్‌ కళాశాల

ఒత్తిడి తగదు

ప్రైవేట్‌ విద్యాసంస్థల మధ్య పోటీతో సిబ్బంది నలిగిపోతున్నారు. అడ్మిషన్ల పేరుతో వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేయడం తగదు. ఎండలు తీవ్రంగా ఉన్నా అడ్మిషన్లకు పంపిస్తున్నారు. దీనివల్ల వారు అనార్యోగానికి గురయ్యే అవకాశం ఉంది. డీఎస్సీకి చదువుకునేలా చూడాలి.

-బర్రి పురుషోత్తం, యువజన సంఘం మాజీ అధ్యక్షుడు, అక్కుపల్లి

Updated Date - Apr 29 , 2025 | 10:49 PM