central minister: ఏడాదిలో ఉద్దానం-2 ప్రాజెక్ట్ పూర్తి
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:49 PM
Uddanam-2 Project Safe drinking water ప్రజాభిప్రాయాలే ప్రామాణికంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం కాగువాడలో రూ.265కోట్ల వ్యయంతో ఉద్దానం ఫేజ్-2 నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రజాభిప్రాయాలే ప్రామాణికంగా పాలన
- కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
పాతపట్నం, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ప్రజాభిప్రాయాలే ప్రామాణికంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శనివారం కాగువాడలో రూ.265కోట్ల వ్యయంతో ఉద్దానం ఫేజ్-2 నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ప్రజల అభ్యర్థన మేరకు ఉద్దానం-2 ప్రాజెక్ట్‌ను వంశధార, పాతపట్నం తాగునీటి పథకంగా నామకరణం చేయనున్నట్లు వెల్లడించారు. ‘పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం. జిల్లాలో ఇప్పటికే రూ.400కోట్లతో సాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాం. మెళియాపుట్టిలో ఐటీడీఏ, పాతపట్నంలో పాలిటెక్నికల్ కళాశాల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నాం. రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వే సేవలు విస్తరణపై దృష్టి సారించాం. మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణం చేపడతాం. ఉపాధిహామీ వేతనదారుల కూలీలు పెంచేలా చర్యలు చేపడతాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సేవలు కల్పిస్తామ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఉద్దానం ఫేజ్-2 నిర్మాణ పనులతో పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలతో పాటు మన్యం జిల్లాలోని మరో రెండు మండలాలకు తాగునీరు అందనుందన్నారు. బూరగాం గ్రామస్థుల అభ్యర్థన మేరకు మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.