Share News

SIs for VR: వీఆర్‌కు ఇద్దరు ఎస్‌ఐలు

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:24 PM

Action against police officers జిల్లాలో అక్రమాలకు పాల్పడే పోలీసులపై చర్యలకు ఎస్పీ మహేశ్వరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం పాతపట్నం నియోజకవర్గంలో ఇద్దరు ఎస్‌ఐలను ఒకేసారి వీఆర్‌(వేకెంట్‌ రిజర్వ్‌)కు పంపేశారు.

SIs for VR: వీఆర్‌కు ఇద్దరు ఎస్‌ఐలు

  • అవినీతి అక్రమాలపై మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు?

  • చర్యలకు ఉపక్రమించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • శ్రీకాకుళం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్రమాలకు పాల్పడే పోలీసులపై చర్యలకు ఎస్పీ మహేశ్వరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం పాతపట్నం నియోజకవర్గంలో ఇద్దరు ఎస్‌ఐలను ఒకేసారి వీఆర్‌(వేకెంట్‌ రిజర్వ్‌)కు పంపేశారు. వివరాల్లోకి వెళ్తే.. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు ఎస్‌ఐగా ఎండీ అమీర్‌ ఆలీ గతేడాది నవంబర్‌లో విధుల్లో చేరారు. హిరమండలం ఎస్‌ఐ యండీ యాసిన్‌ గతేడాది బాధ్యతలు స్వీకరించారు. కొన్ని నెలలు గడిచాక వంశధార నది నుంచి ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఈ ఇద్దరి ఎస్‌ఐలపై అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై దాడులు చేసి.. స్వాధీనం చేసుకున్న డబ్బులు స్వాహా చేసి.. కొంతమందిపై కేసుల్లేకుండా చేశారని ఆరోపణలున్నాయి. హిరమండలం ఎస్‌ఐ వైసీపీ హయాంలో కూడా పాతపట్నం నియోజకవర్గంలో విధులు నిర్వహించారు. మళ్లీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలోనూ అదే నియోజకవర్గంలో మరో మండలంలో పోస్టింగ్‌ తెచ్చుకున్నారంటే ఆయన లాబీయింగ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇక కొత్తూరు ఎస్‌ఐ.. సివిల్‌ వ్యవహారాల్లో జోక్యం.. పేకాట స్థావరాల్లో పట్టుబడిన నగదు లెక్కజెప్పే విషయంలోనూ తేడా చూపించడం... ఇసుక ర్యాంప్‌ల నుంచి మామ్మూళ్లు.. జూన్‌లో సంభవించిన కారు ప్రమాద ఘటనలోనూ, గూనభద్రలో పేకాట స్థావరంపై దాడి చేసి.. కేసు నమోదు చేయలేదన్న ఆరోపణలున్నాయి. శోభనాపురం క్వారీ వద్ద ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాదినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో ఎస్‌ఐల అవినీతిపై పక్కా ఆధారాలతో స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక కూటమి నాయకులు మంత్రి నారా లోకేశ్‌కు, ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇద్దరు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపేస్తూ.. ఎస్పీ ఝలక్‌ ఇవ్వడం పోలీసుశాఖలో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఇన్నాళ్ల నాయకుల అండ ఉంటే చాలు అనుకున్న వారందరికీ... ఓ హెచ్చరిక అన్న సంకేతాలను జిల్లా పోలీసు బాస్‌.. వీఆర్‌ పేరుతో జారీచేశారని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:24 PM