Railway flyover: రెండు వంతెనలు.. రూ.100 కోట్లు
ABN , Publish Date - May 07 , 2025 | 11:49 PM
Bridge construction పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి మహర్దశ పట్టనుంది. కూటమి ప్రభుత్వ పాలనలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి చొరవతో రెండు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించనున్నట్టు రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి.
ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం
నెరవేరనున్న పలాస-కాశీబుగ్గ ప్రజల ఆకాంక్ష
పలాస/ వజ్రపుకొత్తూరు, మే 7(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీకి మహర్దశ పట్టనుంది. కూటమి ప్రభుత్వ పాలనలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి చొరవతో రెండు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.100 కోట్లు కేటాయించనున్నట్టు రైల్వే మంత్రిత్వశాఖ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ నిధులతో పలాస రైల్వేస్టేషన్‌కు ఇరువైపులా తాళభద్ర, కాశీబుగ్గ(చిన్నబడాం రోడ్)లో ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. కాశీబుగ్గ ఫ్లైఓవర్ బ్రిడ్జికి 2008లో శంకుస్థాపన చేసి.. సగంలో నిర్మాణాలు నిలిపేశారు. అలాగే వజ్రపుకొత్తూరు, పలాస మండలాలతోపాటు పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలోని ప్రధాన వార్డులకు వెళ్లేందుకు వీలుగా తాళభద్ర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాశీబుగ్గ ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి చేసే ఎన్నికలకు వెళ్తామని అప్పటి నాయకులు ప్రకటించారు. కానీ పనుల ఊసే లేదు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ప్రస్తుత కూటమి పాలనలో పలాస ఎమ్మెల్యేగా గౌతు శిరీష ఎన్నికైన తరువాత మొదటి ప్రాధాన్యంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా పనులపై నీలినీడలు అలముకున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు సహకారంతో ఢిల్లీ వెళ్లి కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీవైష్ణవ్‌ను కలిసి ఆర్వోబీ సమస్యను ఎమ్మెల్యే శిరీష వివరించారు. తాళభద్ర రైల్వే బ్రిడ్జి సమస్య కూడా ప్రస్తావించారు. దీంతో మొత్తం నిధులన్నీ రైల్వేశాఖే సమకూర్చి రెండు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. నిధులకు ఆమోదం కూడా తెలిపారు. టెండరు ప్రక్రియ పూర్తయితే రెండు బ్రిడ్జిల నిర్మాణం సకాలంలో పూర్తికానున్నాయి. ఏళ్లతరబడి కలలు నెరవేరుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
100 గ్రామాలకు తీరనున్న గేటు కష్టాలు
తాళభద్ర రైల్వేగేటు.. ఉద్దానం ప్రజల చిరకాల సమస్యల్లో ఒకటి. గేటు తెరిచిన సమయం కంటే మూసి ఉంచిన సమయమే అధికమని ఈ ప్రాంతవాసులు తరచూ అసహనం చెందుతారు. పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో సుమారు 100 గ్రామాల ప్రజలు ఈ గేటు మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. మార్కెట్‌కు, పాఠశాలలకు, కళాశాలలకు, ఆస్పత్రులకు, రైల్వేస్టేషన్‌కు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం. తరచూ గేటు పడుతుండడంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోతోంది. అత్యవసర సమయాల్లో పేషెంట్లు కూడా సకాలంలో ఆస్పత్రికి వెళ్లలేక మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటీష్ కాలంలో ఏర్పాటు చేసిన ఈ గేటు సమస్య ఎప్పటికి తీరుతుందోనని ఈ ప్రాంతవాసులు ఎదురుచూస్తూనే ఉన్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో ఎట్టకేలకు ఇక్కడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించనుండడంతో ఉద్దానం ప్రాంతవాసులు, టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు వంద గ్రామాల ప్రజలకు గేటు కష్టాలు తీరనున్నాయని ఊరట చెందుతున్నారు.
ఇబ్బందులు పడ్డాం
తాళభద్ర వద్ద రైల్వే గేటు అధిక సమయం పడుతుండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, ఆస్పత్రికి వెళ్లే రోగుల అవస్థలు అన్నీఇన్నీ కావు. గేటు బాధపడలేక కొంతమంది గ్రామాలు విడిచి పలాస-కాశీబుగ్గలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గేటు సమస్యకు పరిష్కారం చూపుతూ.. బిడ్ర్జి నిర్మాణానికి కృషి చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే శిరీషకు ఉద్దానం ప్రజలు రుణపడి ఉంటారు.
- పోతనపల్లి షణ్ముఖరావు, పల్లిసారథి
ప్రజలకు కానుకగా ఇస్తాం
కాశీబుగ్గ, తాళభద్ర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇస్తాం. ఇప్పటికే నిర్మాణ బాధ్యతలను రైల్వేశాఖ తీసుకొంది. శతశాతం నిధులు రైల్వేశాఖ భరించనుంది. గత ప్రభుత్వం దీనికి నిధులు వెచ్చించకపోవడంతో నిర్మాణ దశలోనే పనులు ఆగిపోయాయి. రూ.వంద కోట్ల మేరకు నిధులు బ్రిడ్జిల నిర్మాణానికి కేటాయించినందుకు రైల్వేశాఖకు ధన్యవాదాలు.
- కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేంద్రమంత్రి
ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న వేళ..
రెండు రైల్వే ప్రధాన బ్రిడ్జిలకు నిధులు రైల్వేశాఖ కేటాయించడం ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్లే. గత ప్రభుత్వం పట్టించుకున్నట్లయితే ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యేది. నిధులు కేటాయింపునకు కృషి చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రైల్వేమంత్రి అశ్వనీవైష్ణవ్‌కు పలాస నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు.
గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస