ఎయిర్‌పోర్టు నిర్వాసితులకు రెండున్నర రెట్లు పరిహారం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:03 AM
Devolopment for airport ‘ఉద్దానం తీరప్రాంతంలో అత్యాధునిక హంగులతో ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మించనుంది. నిర్వాసిత రైతులకు రెండున్నర రెట్టు పరిహారం అందజేయనుంద’ని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఏ ఒక్క గ్రామం తొలగించకుండా నిర్మాణం చేపడతాం
అభివృద్ధిపై రైతులకు అవగాహన కల్పిస్తాం
ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్రావు
వజ్రపుకొత్తూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘ఉద్దానం తీరప్రాంతంలో అత్యాధునిక హంగులతో ప్రభుత్వం ఎయిర్‌పోర్టు నిర్మించనుంది. నిర్వాసిత రైతులకు రెండున్నర రెట్టు పరిహారం అందజేయనుంద’ని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం వజ్రపుకొత్తూరు తహసీల్దార్ కార్యాలయంలో పలాస ఆర్డీవో వెంకటేష్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాంకేతికంగా అనుకూలంగా ఉండడం వల్ల మందస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో ప్రాంతాన్ని ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఎంపిక చేశాం. 1200 ఎకరాల వరకు స్థల సేకరణకు నిర్ణయించాం. అందులో ప్రభుత్వ భూమి 200 ఎకరాల వరకు ఉంది. వజ్రపుకొత్తూరు మండలం మోట్టూరు పంచాయతీలో 150 ఎకరాలు, చీపురుపల్లి పంచాయతీలో 317 ఎకరాలు రైతుల నుంచి సేకరించనున్నాం. ప్రభుత్వ భూమి అధీనంలో ఉన్న రైతులకు జిరాయితీ రైతులతో సమానంగా పరిహారం అందిస్తాం. ఏ ఒక్క గ్రామాన్నీ తొలగించం. భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధరకన్నా రెండున్నర రెట్లు పరిహారం అందిస్తాం. తోటల్లో ఉన్న చెట్లకు, పశువుల శాలలకు రెట్టింపు పరిహారం ఇస్తాం. త్వరలో గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తాం. ఇంకా ఏమైనా డిమాండ్‌లు ఉంటే.. వాటిని రైతులు అధికారుల ముందు వెల్లడించాలి. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఉద్దాన ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఎయిర్‌పోర్టు కారణంగా ఈ ప్రాంతంలో మరిన్ని ప్రాజెక్టులు ఏర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమ’ని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ బీవీ సీతారామ్మూర్తి పాల్గొన్నారు.