Share News

చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించి..

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:56 AM

శ్రీకాకుళం రూరల్‌ మండలం కుందు వానిపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించి..
రమేష్‌ (ఫైల్‌)

- చెరువులో మునిగి యువకుడి మృతి

శ్రీకాకుళం రూరల్‌, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి): శ్రీకాకుళం రూరల్‌ మండలం కుందు వానిపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సూరాడ రోషన్‌ (10) అనే చిన్నారి స్థానికంగా ఉన్న చెరువులో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో కొట్టుమిట్టాడసాగాడు. ఈ దృశ్యాన్ని గమనించిన గ్రామానికి చెందిన సోడిపల్లి రమేష్‌(23) వెంటనే బాలుడిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఎట్టకేలకు అతని ప్రయత్నం ఫలించింది. బాలుడిని ఒడ్డుకు చేర్చాడు. కానీ అప్పటికే రమేష్‌ బాగా అలసిపోవడంతో నీటిలో మునిగిపోసాగాడు. దీన్ని గుర్తించిన గ్రామస్థులు స్పందించి... బయటకు తీశారు. వెంటనే స్థానిక సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేష్‌ ఇటీవలే ఓ షిప్‌ కంపెనీలో ఉన్నత ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ నెల 18న విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలోనే మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ కె.రాము తెలిపారు.

Updated Date - Nov 17 , 2025 | 12:56 AM