ట్రస్టు భూమి.. అన్యాక్రాంతం
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:47 PM
Trust land occupation అది ఓ ట్రస్టుకు చెందిన రూ.కోట్ల విలువైన స్థలం. ఇలాంటివి క్రయవిక్రయాలు చేపట్టకూడదు. లీజుకు మాత్రమే ఇవ్వొచ్చు. కానీ విశాఖలో ఉంటున్న ఓ వ్యక్తి ఈ స్థలాన్ని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.
తన భార్య పేరిట విశాఖ వాసి రిజిస్ట్రేషన్
పొందూరులో రూ.2.5 కోట్ల స్థలం అన్యాక్రాంతం
రిజిస్ట్రార్ కార్యాలయానికి తహసీల్దార్ లేఖ
పొందూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అది ఓ ట్రస్టుకు చెందిన రూ.కోట్ల విలువైన స్థలం. ఇలాంటివి క్రయవిక్రయాలు చేపట్టకూడదు. లీజుకు మాత్రమే ఇవ్వొచ్చు. కానీ విశాఖలో ఉంటున్న ఓ వ్యక్తి ఈ స్థలాన్ని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని లేఖ రాస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పొందూరు అంబేడ్కర్ కూడలిలో రోడ్డుకు ఆనుకుని 220-4 సర్వేనెంబర్‌లో 13 సెంట్ల స్థలం ఉంది. ఇది కలగర్ల సూర్యనారాయణ శెట్టి ట్రస్టు (కేఎస్ పీఎస్‌ఎన్ చౌటరీ) పేరిట ఉంది. దీనివిలువ బహిరంగ మార్కెట్‌లో రూ.2.5 కోట్లు ఉంటుందని అంచనా. గతంలో రెవెన్యూ రికార్డు(ఫసలీ, అడంగల్)ల్లో కేఎస్‌పీఎస్‌ఎన్ చౌటరీ పేరున ఉంది. నిబంధనల మేరకు దేవదాయ, ట్రస్టు భూములు క్రయవిక్రయాలు చేయకూడదు. లీజుకు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ విశాఖలో ఉంటున్న పొందూరువాసి అనకాపల్లి రామారావు 2021లో ఈ స్థలానికి 1-బీ చేయించుకున్నారు. ఆ స్థలాన్ని తన భార్య పేరిట రిజిస్ర్టేషన్ చేయించారు. అప్పటినుంచి దీన్ని విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది కేఎస్‌పీఎస్‌ఎన్ చౌటరీ స్థలమని తెలియడం, 1-బీతో రిజిస్ర్టేషన్ తప్ప మరే ఇతర డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ స్థలంలో పొందూరుకు చెందిన ఎ.నారాయణరావు, కనకరాజు ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఈ వ్యవహారంపై కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
రిజిస్ర్టార్ కార్యాలయానికి లేఖ
220-4 సర్వేనంబరులో 13 సెంట్ల స్థలం పాత ఫసలీ, అడంగల్‌లో కలగర్ల సూర్యనారాయణశెట్టి ట్రస్టుకు చెందినవిగా ఉన్నాయి. ప్రస్తుతం మావద్ద ఉన్న 1399, 1400 ఫసలీలోనూ కేఎస్‌పీఎస్‌ఎన్ చౌటరీ భూములుగానే నమోదయ్యాయి. కొత్తగా అనకాపల్లి రామారావుకు 1-బీ ఎవరు ఇచ్చారనేది తెలియడంలేదు. దీనిపై విచారణ చేస్తున్నాం. ప్రస్తుతం 220-4 సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్ర్టార్ కార్యాలయానికి లేఖ రాస్తున్నాము. ఈ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కలెక్టర్‌కు, ప్రభుత్వానికి లేఖ రాస్తాం.
- ఆర్.వెంకటేష్, తహసీల్దార్, పొందూరు