Land Dispute: భూ తగాదా తెచ్చిన తంటా
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:52 PM
Land dispute littel brother murder నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కామదేనువులో ఆదివారం భూ వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపింది. వారిద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసి.. తమ్ముడి ప్రాణాన్ని బలిగొంది
- తమ్ముడ్ని హతమార్చిన అన్న
- కామదేనువులో కలకలం
నందిగాం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కామదేనువులో ఆదివారం భూ వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపింది. వారిద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసి.. తమ్ముడి ప్రాణాన్ని బలిగొంది. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామదేనువు గ్రామానికి చెందిన కిల్లి తవిటినాయుడు(37).. అన్న ధర్మారావు చేతిలో హతమయ్యాడు. కిల్లి లక్ష్మునాయుడు, ముత్యాలమ్మ దంపతులకు తవిటినాయుడుతోపాటు మరో ఇద్దరు కుమారులు ధర్మారావు, నీలకంఠం ఉన్నారు. తవిటినాయుడు తల్లిదండ్రులతో కలిసి ఉండగా.. మిగిలిన ఇద్దరికీ వివాహాలై వేరుగా కాపురం ఉంటున్నారు. కాగా ఆస్తుల పంపకంలో భాగంగా.. అన్నదమ్ములు తవిటినాయుడు, ధర్మారావు మధ్య తరచూ భూ వివాదం జరుగుతోంది. దీనిలో భాగంగా ఆదివారం పొలం పనులు చేస్తున్న అన్న ఽధర్మారావుతో తవిటినాయుడు ఘర్షణకు దిగాడు. ఈ ఘర్షణ చిలికిచిలికి గాలివానలా మారి చివరకు దాడికి దారి తీసింది. ఈ క్రమంలో ధర్మారావు గడ్డపారతో తలపై బలంగా మోదడంతో తవిటినాయుడు తీవ్రగాయాలకు గురై కుప్పకూలిపోయాడు. తవిటినాయుడును స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. తవిటినాయుడు పలాసలోని ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తవిటినాయుడు వదిన కిల్లి రాములమ్మ(నీలకంఠం భార్య) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ షేక్‌మహ్మద్ ఆలీ తెలిపారు.