Share News

minister achhenna: అక్టోబరులో ట్రైల్‌రన్‌ షిప్‌ రాక

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:23 PM

Trial Run Ship Arrival ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. రూ.1,450 కోట్లతో 57శాతం పనులు పూర్తయ్యాయ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

minister achhenna: అక్టోబరులో ట్రైల్‌రన్‌ షిప్‌ రాక
మూలపేట పోర్టు బెర్త్‌ పనులు పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • - మూలపేట పోర్టు పనులు 57శాతం పూర్తి

  • - బెర్త్‌ను పరిశీలించిన మంత్రి అచ్చెన్నాయుడు

  • టెక్కలి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ‘మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు శరవేగంతో జరుగుతున్నాయి. రూ.1,450 కోట్లతో 57శాతం పనులు పూర్తయ్యాయ’ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం పోర్టు బెర్త్‌ను, డ్రెజ్జింగ్‌, చాకాఫ్‌బ్యాచ్‌, డయాఫ్రమ్‌ వాల్‌ పనులు విశ్వసముద్ర యంత్రాంగంతో కలిసి ఆయన పరిశీలించారు. ‘91 శాతం సౌత్‌బ్రేక్‌ పనులు, 74శాతం డ్రెజ్జింగ్‌ పనులు జరిగాయి. అక్టోబరులో మొదటి ట్రైల్‌రన్‌ షిప్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. 54వేల ఇండోపాట్స్‌కు గాను 40వేల ఇండోపాట్స్‌ పూర్తయ్యాయి. త్వరలో ఓడరేవు శాఖామంత్రితో కలిసి మరోసారి పర్యటించి పోర్టు పనులు పరిశీలిస్తా’నని మంత్రి అచ్చెన్న తెలిపారు. మూలపేట రైతులకు చెట్ల పరిహారం వంటివి అందజేయాలని ఆర్డీవో కృష్ణమూర్తికి సూచించారు. పోర్టు పనుల తీరుపై విశ్వసముద్ర సంస్థ జీఎం శంకరరావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు.

  • సాగునీటి ఇబ్బందులు రానీయొద్దు

  • ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశ్వసముద్ర, పోర్టు యంత్రాంగంతో పాటు వంశధార అధికారులకు ఆదేశించారు. పోర్టు రోడ్డు నిర్మాణ పనుల కారణంగా సాగునీటికి ముప్పు ఏర్పడనుంది. దీనిపై ‘2,500 ఎకరాలకు సాగునీరు అందేనా’ శీర్షికతో మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనంపై మంత్రి అచ్చెన్న స్పందించారు. మంగళవారం బన్నువాడ, అయోధ్యపురం, మోదుగువలస పిఠాపురం, తలగాం, వేములాడ తదితర గ్రామాల రైతులతో కలిసి పోర్టు రోడ్డు పక్కన ఉన్న కాలువలు పరిశీలించారు. పలువురు రైతులు సాగునీటి ఇబ్బందులు, 49ఆర్‌ కాలువ, దేశబట్టి, దాలిచెరువు సర్‌ప్లస్‌వైర్‌ వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో 22 కల్వర్టులు, రెండు అండర్‌పాసేజ్‌లు నిర్మించాలని పోర్టు జీఎం శంకరరావుకు మంత్రి ఆదేశించారు. రైతుల చెట్లుకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. పోర్టు రోడ్డు పనులు పరిశీలించి యుద్ధప్రాతిపదికన కాలువ పనులు వేగవంతం చేయాలని వంశధార ఈ శేఖరరావుకు ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కందులు, మినుములు విత్తనాల కిట్లను రైతులకు అందజేశారు. టెక్కలి మేజర్‌పంచాయతీలో పశువులు రోడ్లుపై తిరగకుండా చివరి అవకాశంగా మైక్‌ల్లో ప్రచారం చేయించాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తికి సూచించారు. ఒకేరోజు ఎక్కువ మంది కార్మికులను పెట్టి పశువులను వాహనాల్లోకి ఎక్కించి దూరప్రాంతాల్లో ఉన్న గోశాలలకు తరలించాలన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, పినకాన అజయ్‌కుమార్‌, హనుమంతు రామకృష్ణ, సనపల మురళి, వట్టికూళ్ల రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:23 PM