Share News

వణికిస్తున్న స్క్రబ్‌టైఫస్‌

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:53 PM

Scrub typhus cases increasing జిల్లావాసులను స్క్రబ్‌టైఫస్‌ వణికిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా జ్వరంతో ప్రారంభమై క్రమేపీ శ్వాస సంబంధ సమస్యలకు దారి తీస్తోంది. రాష్ట్రస్థాయిలో 34 పాజిటివ్‌ కేసులు శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయని చెబుతుండగా, జిల్లా అధికారులు మాత్రం 7 కేసులు మాత్రమే అని పేర్కొంటున్నారు.

వణికిస్తున్న స్క్రబ్‌టైఫస్‌

జిల్లాలో పెరుగుతున్న కేసులు

గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా వైరస్‌ వ్యాప్తి

ముందే మేల్కొనకపోతే ముప్పే

రణస్థలం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లావాసులను స్క్రబ్‌టైఫస్‌ వణికిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి కారణంగా జ్వరంతో ప్రారంభమై క్రమేపీ శ్వాస సంబంధ సమస్యలకు దారి తీస్తోంది. రాష్ట్రస్థాయిలో 34 పాజిటివ్‌ కేసులు శ్రీకాకుళం జిల్లాలో నమోదయ్యాయని చెబుతుండగా, జిల్లా అధికారులు మాత్రం 7 కేసులు మాత్రమే అని పేర్కొంటున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో జ్వరాల తీవ్రత పెరుగుతోంది. ఈ తరుణంలో నిర్ధారణ పరీక్షల్లో ఈ కొత్త వైరస్‌ వెలుగుచూస్తుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలోని ల్యాబ్‌లో ఈ వైరస్‌ నిర్ధారణకు పరీక్షలు చేస్తున్నారు.

ఇన్‌ఫెక్షన్ల రూపంలో బయటకు..

విదేశాల్లో గుర్తించిన ఈ వైరస్‌ మన దేశంలోకి వ్యాపించింది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. స్క్రబ్‌టైఫస్‌ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు వస్తాయి. వారం, పదిరోజుల తరువాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్‌ఫెక్షన్‌ బయటపడుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే శ్వాస సంబంధిత రుగ్మతలకు దారితీస్తాయి. మెదడు, వెన్నెముక ఇన్‌ఫెక్షన్లతోపాటు మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీసే అవకాశం ఉంది. స్క్రబ్‌టైఫస్‌ పీడితులకు సకాలంలో వైద్యసేవలు అందిస్తే మరణాల రేటు 2 శాతం లోపు ఉంటుంది. సకాలంలో చికిత్స అందించకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

ఆ ప్రాంతాల్లో అధికం..

జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయా, బాహుదా నదులు ఉన్నాయి. ఆపై ఏజెన్సీతో పాటు ఉద్దాన ప్రాంతం ఉంది. అక్కడ కీటకాల సంచారం అధికం. అందుకే ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తికి అవకాశం ఉంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య స్క్రబ్‌టైఫస్‌ కీటకాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్‌ సోకదు. కానీ కీటకం కాటుకు గురైన వ్యక్తి మాత్రం అస్వస్థతకు గురవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల శాలలు, పాకలు, వ్యర్థాలు పోగుచేసే ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తి చేతులు ఉన్న చొక్కాలు, ఫ్యాంట్లు, కాలికి సాక్సులు, బూట్లు ధరిస్తే మంచిది. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలో ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని మార్చాలి. లేదంటే శుభ్రం చేశాక వాటిని వాడాలి. పిల్లలు ఆరుబయట ఆటలు ఆడే సమయంలో సైతం అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

చురుగ్గా నిర్ధారణ పరీక్షలు

జిల్లాలో 7 పాజిటవ్‌ కేసులు నమోదయ్యాయి. అందుకే నిర్ధారణ పరీక్షలు పెంచుతున్నాం. జ్వరం అని తేలిగ్గా తీసుకోవద్దు. అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

- కె.అనిత, డీఎంహెచ్‌వో, శ్రీకాకుళం

Updated Date - Dec 02 , 2025 | 11:53 PM