srikakulam to ichhapuram : రోజంతా ప్రయాణమే!
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:33 PM
There are many difficulties in going to the district headquarters, Srikakulam పౌరసేవలు, శాఖపరమైన పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనారోగ్య, అత్యవసర పరిస్థితులైతే ఎక్కువగా ఈ నియోజకవర్గ ప్రజలు ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్, భువనేశ్వర్‌కు వెళ్తారు. కలెక్టరేట్‌కు, జడ్పీకి, జిల్లాపరమైన పనులకు మాత్రం తప్పకుండా శ్రీకాకుళం వెళ్లాల్సిందే.
జిల్లాకేంద్రం శ్రీకాకుళం వెళ్లాలంటే ఎన్నో ఇక్కట్లు
ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు వ్యయప్రయాస
పలాసను జిల్లాగా ఏర్పాటు చేస్తే తీరనున్న కష్టాలు
మంత్రుల కమిటీకి వినతులిచ్చేందుకు సిద్ధం
శ్రీకాకుళం జిల్లాకేంద్రంలోని జడ్పీలో ‘మీ కోసం (గ్రీవెన్స్)’ కార్యక్రమానికి గతంలో వెళ్లాను. ఆ రోజు ఉదయం 4గంటలకు లేచి ఐదు గంటలకు బస్సులో బయలుదేరితే శ్రీకాకుళం చేరేసరికి 9 గంటలైంది. గ్రీవెన్స్ పని ముగించుకొని మధ్యాహ్నం 1 గంటకు అక్కడ బయలుదేరితే సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నాను. రోజంతా కేటాయించడంతో ఇతర పనులు మానుకోవాల్సి వచ్చింది.
- ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన శ్రీనివాస్ ఆవేదన ఇది
...............
జిల్లాకేంద్రంలో ఇటీవల ఓ సమావేశానికి విధిగా హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అక్కడ సమావేశం జరిగింది రెండు గంటలే కానీ.. రానూపోను ప్రయాణం ఆరు గంటలు పట్టింది. దీంతో సమయం చాలా వృథా అయ్యింది. ఆ ప్రభావం ఇతర శాఖాపరమైన పనులపై పడింది.
- ఇచ్ఛాపురంలోని ఓ అధికారి ఆవేదన ఇది
...............
గతంలో వెహికల్ ఫిట్‌నెస్‌కు సంబంధించి స్థానిక కార్యాలయంలో నిర్ధారించేవారు. కానీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దానిని జిల్లా కేంద్రానికే పరిమితం చేశారు. వారు నిర్దేశించిన ప్రకారం వాహనాల సామర్ధ్య పరీక్ష అక్కడే నిర్వహించాలి. దీంతో రానూపోనూ 250 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వచ్చింది.
- ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ దక్కత శ్రీరాం ఆవేదన ఇది
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి) : పౌరసేవలు, శాఖపరమైన పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనారోగ్య, అత్యవసర పరిస్థితులైతే ఎక్కువగా ఈ నియోజకవర్గ ప్రజలు ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్, భువనేశ్వర్‌కు వెళ్తారు. కలెక్టరేట్‌కు, జడ్పీకి, జిల్లాపరమైన పనులకు మాత్రం తప్పకుండా శ్రీకాకుళం వెళ్లాల్సిందే. కాగా.. ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం వెళ్లాలంటే 126 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంటే రానూపోనూ 250కిలోమీటర్లు పైమాటే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం వెళ్లాలంటే రోజంతా ప్రయాణించాల్సి వస్తోందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. జిల్లాకేంద్రం సుదూరం కావడంతో పలాసను కొత్త జిల్లాగా ప్రకటిస్తారని.. అందులో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని చేర్చుతారనే ప్రచారం సాగుతోంది. జిల్లాల ఏర్పాటు, డివిజన్, మండలాల చేర్పులు, మార్పులకు అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ అభిప్రాయాలను సేకరించనుంది. దీంతో ఇచ్ఛాపురం ప్రజలు పలాస జిల్లా ఏర్పాటు చేయాలని, అందులో తమ నియోజకవర్గాన్ని కలపాలని కోరుతున్నారు.
పలాస జిల్లా అయితే..
ఒడిశా నుంచి వచ్చేటప్పుడు ఇచ్ఛాపురం నియోజకవర్గం మొట్టమొదటిగా ఉంటుంది. అందుకే ఇచ్ఛాపురం పట్టణాన్ని ఈశాన్య ముఖద్వారంగా పిలుస్తారు. ఈ నియోజకవర్గంలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట మండలాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడతారు. కొబ్బరితోటల సాగుతోపాటు వరి పండిస్తారు. మహేంద్రతనయా, బాహుదా నదులు ఉన్నా.. ఒడిశా ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టుల ఏర్పాటుతో ఇక్కడ నీటి లభ్యత లేదు. మత్స్యకారులతోపాటు చిన్నసన్నకారు రైతులు ఎక్కువ మంది ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అందుకే తలసరి ఆదాయంలో కూడా ఈ నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో పలాస జిల్లాలో ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని చేర్చి మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచితే ప్రయోజనం ఉంటుంది.
పలాసను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటుచేస్తే ఇచ్ఛాపురానికి దూరభారం తగ్గుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రం 126 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. పలాస అయితే కేవలం 48 కిలోమీటర్లే. దీంతో ప్రజల రవాణా కష్టాలు సైతం తొలగుతాయి. గతంలో ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని అన్ని మండలాలు టెక్కలి రెవెన్యూ డివిజన్‌లో ఉండేవి. అప్పట్లో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఏదైనా పనిపై టెక్కలి వెళ్లాలంటే వ్యయప్రయాసలకు గురయ్యారు. పలాస డివిజన్ చేయడంతో కొంత ఉపశమనం దక్కింది. ఇప్పుడు పలాసను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీ ఆలోచించాలని కోరుతూ పెద్ద ఎత్తున వినతిపత్రాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
పలాస జిల్లాను ఏర్పాటు చేయాలి
శ్రీకాకుళం అనే పేరు దశాబ్దాలుగా సుపరిచితం. ఆ జిల్లా వాసులుగా ఎంతగానో ఆనందపడుతుంటాం. కానీ ఇచ్ఛాపురం నియోజకవర్గ వాసిగా మాత్రం బాధపడుతుంటాం. ఎందుకంటే జిల్లా కేంద్రం 126 కిలోమీటర్ల దూరంలో ఉండడం నిజంగా బాధాకరం. అన్నివర్గాల ప్రజలు ఎంతో వ్యయప్రయాసలకు గురవుతుంటారు. అందుకే పలాస జిల్లాను ఏర్పాటు చేయాలి.
- డాక్టర్ ఉలాల కోదండరామ్, ప్రముఖ వైద్యుడు, ఇచ్ఛాపురం
ఒడిశాతోనే అనుబంధం
శ్రీకాకుళం జిల్లా కేంద్రం కంటే ఒడిశా వెళ్లడం చాలా సులువు. పక్కన ఉన్న గంజాం జిల్లా కేంద్రం బరంపురం అరగంటలో వెళ్లిపోవచ్చు. అందుకే ఏ చిన్న అవసరానికైనా ఇచ్ఛాపురం ప్రజలు బరంపురం వెళుతుంటారు. కేవలం ప్రభుత్వపరమైన పౌరసేవలు, సంక్షేమ పథకాలు, శాఖాపరమైన పనులకు వ్యయప్రయాసలకోర్చి శ్రీకాకుళం వెళుతుంటారు. అందుకే పలాస జిల్లాను తక్షణం ప్రకటించాలి.
- చాట్ల తులసీదాస్‌రెడ్డి, వెంకటరామలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్