ప్రైవేటు బస్సుల్లో గంజాయి రవాణా
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:49 PM
marijuana Transporting పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట గంజాయి ముఠా పట్టుబడుతూనే ఉంది. తాజాగా ప్రైవేటు బస్సుల్లో గంజాయి రవాణా చేస్తూ వేర్వేరుగా ఇద్దరు ఒడిశా వాసులు పోలీసులకు పట్టుబడ్డారు. పలాసలో మరొకరు పట్టుబడగా.. ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.
వేర్వేరు కేసుల్లో ఒడిశావాసులు ఇద్దరి అరెస్టు
పలాసలో మరొకరు పట్టుబడిన వైనం
నరసన్నపేట/పలాస, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా.. గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు. నిత్యం ఏదో ఒకచోట గంజాయి ముఠా పట్టుబడుతూనే ఉంది. తాజాగా ప్రైవేటు బస్సుల్లో గంజాయి రవాణా చేస్తూ వేర్వేరుగా ఇద్దరు ఒడిశా వాసులు పోలీసులకు పట్టుబడ్డారు. పలాసలో మరొకరు పట్టుబడగా.. ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా 34.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ఒడిశా నుంచి బెంగళూరు, చెన్నైకి ప్రైవేటు బస్సుల్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని మడపాం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్నామని సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ శనివారం విలేకరులకు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట ఎస్‌ఐ దుర్గాప్రసాద్, పోలీసులు మడపాం టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు బస్సులో ఒడిశాకు చెందిన త్రిలోచన మదలి 10.5 కేజీల గంజాయితో పట్టుబడ్డాడు. ఆ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే మరో ప్రైవేటు బస్సులో 11 కేజీల గంజాయితో ఒడిశాకు చెందిన తపన్‌కుమార్ మహంతి పట్టుబడ్డాడు. ఆయన ఒడిశా నుంచి చెన్నైకు గంజాయిని రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి.. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్ వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా తండిగూడ గ్రామానికి చెందిన సపన్‌కుమార్ బెబరాత 13 కిలోల గంజాయితో పట్టుబడ్డాడని కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. పర్లాకిమిడిలో తారకబారికో అనే వ్యక్తి నుంచి సపన్‌కుమార్ బెబరాత రూ.2వేలకు గంజాయి కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి బస్సులో నేరుగా కాశీబుగ్గ చేరుకున్నాడు. అనంతరం బ్యాగుతో పలాస రైల్వేస్టేషన్ రోడ్డులో వెళ్తుండగా ఎస్‌ఐ నర్సింహమూర్తి సాధారణ తనిఖీలు చేస్తుండగా తారసపడ్డాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా సపన్‌కుమార్ బెబరాతను పట్టుకున్నారు. బ్యాగ్‌ను తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని సీఐ సూర్యనారాయణ తెలిపారు.