కారులో గంజాయి రవాణా
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:27 AM
209 kg of marijuana seized జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి నిల్వలు లభ్యమయ్యాయి. ఒడిశా నుంచి జిల్లా మీదుగా ఉత్తరప్రదేశ్‌కు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు.
209 కేజీల నిల్వలు స్వాధీనం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరి అరెస్టు
శ్రీకాకుళం క్రైం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి నిల్వలు లభ్యమయ్యాయి. ఒడిశా నుంచి జిల్లా మీదుగా ఉత్తరప్రదేశ్‌కు కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. ‘ఎచ్చెర్ల ఎస్‌ఐ సందీప్‌కు వచ్చిన సమాచారం మేరకు బుధవారం చిలకపాలెం- పొందూరు రహదారి వద్ద వాహనాల తనిఖీ చేశాం. ఈ క్రమంలో డీఎల్ 4సీ ఎన్‌ఈ 8246 నెంబర్ గల కారులో సుమారు 40 ప్యాకెట్లలో 209 కేజీల గంజాయి ఉన్నట్టు గుర్తించాం. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిని వెంబండించి అదుపులోకి తీసుకున్నాం. ఎచ్చెర్ల పోలీసుస్టేషన్‌లో విచారణ చేపట్టాం. ఆ ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని గజయాబాద్‌కు చెందిన సునీల్, మీరట్‌కు చెందిన విశాల్‌గా గుర్తించాం. వీరిద్దరూ కొరాపుట్ జిల్లా లంపటాపుట్ గ్రామానికి చెందిన సమరామఠం అలియాస్ డుంబురు అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశారు. దీనిని ఉత్తరప్రదేశ్ బాగ్‌పాట్ జిల్లా మీరట్‌కు చెందిన గౌరవ్‌కు అందజేసేందుకు వెళుతున్నారు. సిమిలిగూడ మీదుగా సుంకి చెక్‌పోస్టు వద్దకు తీసుకొని వచ్చి.. సాలూరు నుంచి రామభద్రాపురం, రాజాం మీదుగా చిలకపాలెం జంక్షన్ వద్దకు రాగా.. వాహన తనిఖీల్లో పట్టుబడ్డార’ని ఎస్పీ తెలిపారు. వారిద్దరిని అరెస్టు చేశామని, గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకునేందుకు తమ పోలీసుల బృందం అక్కడకు కూడా వెళ్లిందని వివరించారు. నిరంతర నిఘాతో జిల్లాలో పూర్తిస్థాయిలో గంజాయి అక్రమ రవాణాకు కృషి చేస్తున్నామని తెలిపారు.