Transportation of marijuana: ఒడిశా టూ తమిళనాడు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:14 AM
Transportation of marijuana: ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 20.670 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు.
-20.670 కేజీల గంజాయి రవాణా
- ఇద్దరి అరెస్టు
ఇచ్ఛాపురం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 20.670 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ వివరాలను బుధవారం సర్కిల్ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నమనాయుడు విలేకరులకు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరునవల్లి జిల్లా తుతుక్కుడి పట్టణానికి చెందిన వి.సతీష్‌కుమార్‌తో పాటు ఓ బాలుడు ఒడిశా రాష్ట్రం మోహన్ బ్లాక్ చంద్రగిరికి చెందిన ఇసాక్ బీర వద్ద 20.670కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. తమిళనాడు రాష్ట్రం మెలపాలయం గ్రామానికి చెందిన గంజాయి వ్యాపారి హుస్సేన్ (అలియాస్ షౌఖక్ ఆలీ)కు అందించేందుకు ఈ సరుకు కొనుగోలు చేశారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొని వారు బస్సులో ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నడుచుకుంటూ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ ముకుందరావు తన సిబ్బందితో రైల్వే స్టేషన్‌కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన సతీష్‌కుమార్‌తో పాటు బాలుడి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి మూటలు బయటపడ్డాయి. సతీష్‌ను అరెస్టు చేసి ఇచ్ఛాపురం మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. బాలుడిని శ్రీకాకుళం జేజేబీ బోర్డు వద్ద హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.