Share News

Animal trafficking: మూగరోదన.. వినేదెవరు?

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:00 AM

Cattle transportation జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటివరకూ వ్యవసాయం, పాల ఉత్పత్తి కోసం పశువులను పెంచారు. కానీ ఇప్పుడు కొంతమంది దగ్గరుండి వాటిని కబేళాలకు పంపుతున్నారు. పశుపోషణ భారమై.. యంత్రాలతో సాగుచేస్తున్నవారు పశువులను విక్రయిస్తున్నారు.

Animal trafficking: మూగరోదన.. వినేదెవరు?

  • కబేళాలకు పశువుల తరలింపు

  • దారుణంగా వాహనాల్లో కుక్కి రవాణా

  • కానరాని కనీస నిబంధనలు

  • ఏటా జిల్లాలో తగ్గిపోతున్న ఆవులు, గేదెలు

  • గత నెల 25న ఎచ్చెర్ల మండలం నవభారత్‌ జంక్షన్‌ వద్ద పోలీసులకు అక్రమంగా తరలిస్తున్న రెండు పశువుల వ్యాన్‌లు పట్టుబడ్డాయి. నారాయణవలస నుంచి అలమండకు తరలిస్తున్న 12 ఆవులతో ఓ వ్యాన్‌, 6 గేదెలతో మరో వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కొత్తవలస గోశాలకు తరలించారు.

  • గత నెల 30న నరసన్నపేట నుంచి విశాఖ వైపు తొమ్మిది ఆవులతో వెళ్తున్న వ్యాన్‌ను బుడుమూరు వద్ద లావేరు పోలీసులు అడ్డుకుని సీజ్‌ చేశారు. నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో వాటిని కొనుగోలు చేసి తరలిస్తున్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

  • ఇచ్ఛాపురం, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటివరకూ వ్యవసాయం, పాల ఉత్పత్తి కోసం పశువులను పెంచారు. కానీ ఇప్పుడు కొంతమంది దగ్గరుండి వాటిని కబేళాలకు పంపుతున్నారు. పశుపోషణ భారమై.. యంత్రాలతో సాగుచేస్తున్నవారు పశువులను విక్రయిస్తున్నారు. సాటి రైతుకు విక్రయిస్తే ఫర్వాలేదు కానీ.. దళారులకు విక్రయిస్తుండడంతో అవి జిల్లాలు, రాష్ట్రాలు దాటి కబేళాలకు తరలిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వాటి రోదన వర్ణణాతీతంగా మారింది. క్రమేపీ జిల్లాలో ఏటా పశువుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది పశుగణన పూర్తయిన తర్వాత 4,56,000 ఆవులు, 46,000 గేదెలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఓ దశాబ్దం కిందట ఒక్క నియోజకవర్గంలోనే సుమారుగా ఇన్ని ఆవులు, గేదెలు ఉండేవంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ రావడంతో రైతులకు పశువుల అవసరం లేకుండా పోతోంది. దీంతో చాలామంది పశువులను సంతల్లో విక్రయిస్తున్నారు. వాటిని దళారులు కొనుగోలు చేసి.. కబేళాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

  • ప్రతీవారం వేల పశువులు..

    జిల్లాలో అంపురం, బుడుమూరు, తిలారు సంతలు ప్రముఖంగా ఉన్నాయి. వీటి నుంచి వారానికి 5 నుంచి 8వేల వరకూ ఆవులు ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారని తెలుస్తోంది. కొనుగోలుచేసిన పశువులను గ్రేడింగ్‌ చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవి ఒక వైపు.. అనారోగ్యంగా ఉన్నవాటిని మరోవైపు విభజిస్తారు. అనారోగ్యంగా ఉన్నవాటిని మన రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న హైదరాబాద్‌కు తరలిస్తారు. ఆరోగ్యంగా ఉన్నవాటిని దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ పోర్టులకు తరలించి.. అక్కడ నుంచి విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో లారీలాంటి ప్రత్యేక వాహనాల్లో రెండు అంతస్తుల్లో వాటిని రూపొందించి పశువుల తరలింపునకు వినియోగిస్తున్నారు. సాధారణంగా 15-20 పట్టే వాహనాల్లో.. 40 నుంచి 50 పశువులను ఎక్కిస్తుంటారు. ఒక్కో వాహనంలో గమ్యస్థానాలకు పశువులు తరలించాలంటే రూ.3లక్షల వరకూ వసూలు చేస్తారు. కేరళ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిన తరువాత క్షేమంగా గమ్యానికి చేరినట్టే. అక్కడ పశువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు ఉండవు.

  • విదేశాల్లో డిమాండ్‌..

    పశుమాంసానికి కొన్ని దేశాల్లో విపరీతమైన గిరాకీ. అక్కడ పశుమాంసం విక్రయాలు, వినియోగానికి ఎటువంటి ఆంక్షలు కూడా ఉండవు. దేశీయంగా కిలో పశుమాంసం రూ.250 నుంచి రూ.450 పలుకుతోంది. కానీ అక్కడ మాత్రం రూ.5వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రతోపాటు ఒడిశాకు చెందిన పశువులను వధించి పోర్టులు, ఇతరత్రా అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు చేర్చుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు జిల్లాలో చాలాప్రాంతాల్లో పశువుల కొనుగోలుకు కొంతమంది దళారులను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. కొనుగోలుదారుల విషయం అసలు బయటకు తెలియదు. రైతుల రూపంలో గ్రామాల్లోకి వస్తారు. పశువులను కొనుగోలు చేస్తారు. వాటిని రహస్య ప్రాంతాలకు తరలిస్తారు. రాత్రిపూట లారీలు, ఇతర వాహనాల్లో కుక్కి తరలిస్తుంటారు. మరికొందరైతే కంటైనర్లతో రహస్యంగా తరలించుకుపోతున్నారు.

  • నిబంధనలు బేఖాతరు..

    పశువుల తరలింపు, రవాణాకు అనుమతిపత్రాలు తప్పనిసరి. సుదూర ప్రాంతాలకు వ్యవసాయ పనుల నిమిత్తం, పాడి అవసరాలకు తరలిస్తున్నామని ధ్రువీకరిస్తూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నుంచి అనుమతి తీసుకోవాలి. వాహనాల విషయంలో సైతం నిబంధనలు పాటించాలి. పశువులు ఎక్కడానికి, దిగడానికి వాహనాలు అనువుగా ఉండాలి. గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. వైద్య కిట్లు వాహనంలో అందుబాటులో ఉండాలి. సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నట్లయితే పశుగ్రాసం ఉంచాలి. అవి నిల్చునే వెసులబాటు ఉండాలి. కానీ ఇవేవీ పాటించిన దాఖాలాలు లేవు. రవాణా విషయంలో కనీసస్థాయిలో కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒకే వాహనంలో 40 నుంచి 50 పశువులను కుక్కి తరలిస్తున్నారు. దారిపొడవునా కనీసం వాటికి ఆహారం వేయడం లేదు. దీంతో ఆకలికి, దప్పికతో అలమటించే పశువులు మార్గ మధ్యలో మృత్యువాతపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

  • ప్రత్యేకంగా దృష్టి

    పశువుల అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సరిహద్దు ప్రాంతాలపై సైతం నిఘా ఉంచాం. అంతర్‌ రాష్ట్ర రహదారులతోపాటు గ్రామీణ రోడ్లలో పశువులు తరలించే వాహనాలను తనిఖీ చేస్తున్నాం. అన్నిరకాల అనుమతులు, వ్యవసాయ పనుల నిమిత్తం తరలిస్తున్నారని తేలాక విడిచిపెడుతున్నాం. అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను నిలిపివేస్తున్నాం.

    - చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం

Updated Date - Jun 02 , 2025 | 12:00 AM