Share News

Student transportation: విద్యార్థులకు తీపికబురు

ABN , Publish Date - Jul 13 , 2025 | 11:55 PM

Travel charges విద్యార్థులందరికీ ఊరట కలిగించేలా ఇకపై ప్రభుత్వమే రవాణా చార్జీలు చెల్లించనుంది. కిలోమీటరు దాటి పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మూడునెలలకోసారి రవాణాచార్జీల నిధులు రూ.1,800 చొప్పున జమ చేయనుంది.

Student transportation: విద్యార్థులకు తీపికబురు
అడ్డివాడ నుంచి నర్శింగపల్లి పాఠశాలకు నడుచుకుని వెళ్తున్న విద్యార్థులు (ఫైల్‌)

  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రవాణా చార్జీలు

  • కిలోమీటరు దాటి వస్తున్న వారికి ప్రతీనెలా రూ.600

  • ప్రతీ మూడునెలలకోసారి తల్లుల ఖాతాల్లో జమ

  • తల్లిదండ్రుల్లో హర్షం

  • టెక్కలి రూరల్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి):

  • మెళియాపుట్టి మండలం అడ్డివాడ గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతీరోజు సుమారు 5కిలోమీటర్లు దూరంలో ఉన్న టెక్కలి మండలం నర్సింగపల్లి పాఠశాలకు వెళ్లి వస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా నడుచుకుని రాకపోకలు సాగిస్తున్నారు.

  • టెక్కలి మండలం సన్యాసినీలాపురం, గూడేం గ్రామాల నుంచి ప్రతీరోజు సుమారు 15మంది విద్యార్థులు నర్సింగపల్లి జిల్లాపరిషత్‌ పాఠశాలకు ఆటోల్లో వస్తున్నారు. రవాణా చార్జీల భారంతో తల్లిదండ్రులు కాస్త ఇబ్బందులు పడుతున్నారు.

  • మెళియాపుట్టి మండలం టీకేఆర్‌ పురం, జాడుపల్లి, జోడూరు గ్రామాలకు చెందిన విద్యార్థులు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాపర జిల్లాపరిషత్‌ పాఠశాలలో చదువుతున్నారు. ఈ విద్యార్థులు కూడా రోజూ ఆటోల్లో రాకపోకలు సాగిస్తున్నారు.

  • .. ఇటువంటి విద్యార్థులందరికీ ఊరట కలిగించేలా ఇకపై ప్రభుత్వమే రవాణా చార్జీలు చెల్లించనుంది. కిలోమీటరు దాటి పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో మూడునెలలకోసారి రవాణాచార్జీల నిధులు రూ.1,800 చొప్పున జమ చేయనుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో 2,955 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు సుమారు 1,60,038 మంది విద్యార్థులు చదువుతున్నారు. కిలోమీటరు దాటి పాఠశాలలకు వస్తున్న విద్యార్థులు సుమారు 3వేల మంది ఉంటారని అధికారుల అంచనా. వీరికి రవాణా చార్జీల కింద నెలకు రూ.600 చొప్పున ప్రభుత్వం అందజేయనుంది. ప్రతీ మూడు నెలలకోసారి రూ.1,800 చొప్పున విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేయనుంది. అలాగే భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు సైతం ప్రభుత్వం చెల్లించే రవాణా చార్జీలను పెంచే యోచనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఉన్నట్టు తెలుస్తోంది. భవిత కేంద్రాల్లో ఒక్కో విద్యార్థికి ప్రస్తుతం నెలకు రూ.300 చొప్పున అందజేస్తున్నారు. ఈ డబ్బులు చాలడం లేదని, చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి సైతం రవాణా చార్జీల నిధులు రెట్టింపు చేయనున్నట్టు సమాచారం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తల్లికి వందనం కింద ఏడాదికి రూ.13వేలు చొప్పున నిధులు జమ చేసిన ప్రభుత్వం.. తాజాగా రవాణా చార్జీలు కూడా చెల్లించనుండడంతో తమకు ఎంతో ఊరట కలుగుతోందని పేర్కొంటున్నారు.

  • ఆదేశాలు వచ్చాయి

  • విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రతీ మూడు నెలలకు కచ్చితంగా రవాణా ఖర్చులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

    - ఎస్‌.దేవేంద్రరావు, ఎంఈవో, మెళియాపుట్టి

Updated Date - Jul 13 , 2025 | 11:55 PM