Share News

sachivalayam: ఇక సచివాలయాల్లో... బదిలీలు

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:27 PM

Village/Ward Secretariat staff transfers గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. సచివాలయాల్లో ఈ ఏడాది మే 31నాటికి ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి బదిలీ చేయనుంది.

sachivalayam: ఇక సచివాలయాల్లో... బదిలీలు
గొప్పిలి సచివాలయం

  • ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారికి స్థానచలనం తప్పనిసరి

  • ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశం

  • సొంత మండలాల్లో పనిచేస్తున్న వారిని కదిలించాలని స్పష్టం

  • మెళియాపుట్టి/ నరసన్నపేట, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. సచివాలయాల్లో ఈ ఏడాది మే 31నాటికి ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన వారికి బదిలీ చేయనుంది. ఉద్యోగుల హేతుబద్ధీకరణతోపాటు బదిలీల పక్రియకు మార్గదర్శకాలను జారీ చేసింది. సొంత మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర మండలాలకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హేతుబద్ధీకరణకు సంబంధించి క్లస్టర్లను పరిగణలోకి తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో బదిలీల సందడి నెలకొంది.

  • జిల్లాలో 752 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 6,868 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో గతేడాది సెప్టెంబరులో సాధారణ బదిలీల్లో భాగంగా కొంతమంది స్థానచలనం అయ్యారు. కొందరు ఉద్యోగోన్నతిపై వెళ్లారు. ఈ సారి ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. రిక్వెస్ట్‌ బదిలీలకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. దృష్టిలోపం, వినికిడి లోపం, ఆర్థోపెడిక్‌ సమస్యలు ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వనున్నారు. రెండు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. జనాభా నిష్పత్తి మేరకు ఆరుగురు, ఏడుగురు, ఎనిమిది మంది సిబ్బంది ఉండేలా సచివాలయాను మూడు కేటగిరీలుగా విభజించారు. క్లస్టర్‌ పరిధిలో సిబ్బందిని హేతుబద్ధీకరణ ప్రామాణికంగా నియమించనున్నారు. మిగిలిన వారిని ఇతర శాఖలకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రక్షాళన చేపట్టనున్నారు.

  • సొంత మండలాన్ని వీడాల్సిందే..

  • వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా సొంత మండలాల్లోనే చాలామంది సచివాలయ ఉద్యోగులను నియమించారు. దీంతో ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సొంత మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను వేరే ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఆయా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు అనుకూలంగా ఉన్న మండలాలు బదిలీ చేయించుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే సిఫారసు లేఖలు కోసం యత్నిస్తున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:27 PM