కొత్తటీచర్లకు శిక్షణ తప్పనిసరి
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:06 AM
మెగా డీఎస్సీ ద్వారా ఇటీవల ఎంపికైన కొత్త టీచర్లకు శిక్షణ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అన్నారు.
పూర్తి చేసిన వారికే నియామకపు ఉత్తర్వులు
స్పష్టం చేసిన విద్యాశాఖ డైరెక్టర్
జిల్లాలో 3 నుంచి ప్రారంభంకానున్న శిక్షణ
నరసన్నపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ ద్వారా ఇటీవల ఎంపికైన కొత్త టీచర్లకు శిక్షణ తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అన్నారు. శిక్షణ పూర్తిచేసిన తర్వాతే వారికి నియామకపు ఉత్తర్వులు జారీ చేస్తామని ఇటీవల జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 3 నుంచి 10 వరకు నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభంకానుంది. ఏదైనా కారణంతో శిక్షణకు మినహాయింపు కోరితే అనుమతించాలని, వారికోసం తర్వాత మళ్లీ శిక్షణ ఇస్తామని ఆయన అన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో కొత్తవారిని నియమిస్తామని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బదిలీల్లో భాగంగా ఏదైనా పాఠశాలకు చెందినఉపాధ్యాయులంతా బదిలీలు కోరి.. ఇంకా రిలీవర్ రాని కారణంగా అక్కడే పనిచేస్తుంటే, అలాంటి చోట కొత్తవారిని మొదట నియమించాలని ఆదేశించారు. కేటగిరీ 3,4 ప్రాంతాల్లోనే ప్రాధాన్యత క్రమంలో నియమించాలని విజయరామరాజు ఆదేశించారు. సెప్టెంబరు 30 నాటికి ఖాళీలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో ఖాళీల వివరాలను ఆప్‌లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
నాలుగు కేంద్రాల్లో..
మెగా డీఎస్సీ ద్వారా జిల్లాలో ఎంపికైన 534 మంది కొత్త టీచర్లకు ఈ నెల 3 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రవికుమార్ తెలిపారు. వీరి కోసం జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశ్వవిజేత జూనియర్ కళాశాల, గ్లోబల్ స్కూల్, గొంటి వీధి మున్సిపల్ స్కూల్‌తో పాటు మరొక పాఠశాలలో శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణ కేంద్రాలకు ఉదయం ఏడు గంటలకే చేరుకోవాలన్నారు. ఆయా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
నేడు ఎంఈవోలతో సమావేశం
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు డీఈవో రవికుమార్ తెలిపారు. మండలాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన వివరాలతో ఎంఈవోలు రావాలని ఆయన ఆదేశించారు. 3,4 కేటగిరీ ప్రాంతాల్లో ఖాళీలు, అలాగే పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు లేని పాఠశాలలను గుర్తించాలని అన్నారు.