విషాదం
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:08 AM
భావనపాడు తీరంలో సముద్ర స్నానం చేస్తూ మంగళవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు.
-సముద్రంలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతి
-భావనపాడు తీరంలో మృతదేహాలు లభ్యం
టెక్కలి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): భావనపాడు తీరంలో సముద్ర స్నానం చేస్తూ మంగళవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. వారి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి పంచాయతీ మడేవానిపేటకు చెందిన దున్న దుర్యోధన (18), పూడిజగన్నాథపురం గ్రామానికి చెందిన తిమ్మల జశ్వంత్ (18), పలాస మండల టెక్కలిప ట్నంకు చెందిన రాయల రాజేష్(19) సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. వారు ఏ ప్రాంతంలో స్నానానికి దిగారో అక్కడికి అతి దగ్గరగా మృతదేహాలు కొట్టుకువచ్చాయి. జశ్వంత్, రాజేష్ మృతదేహాలు బుధవారం ఉదయానికే లభ్యమైనట్లు మెరైన్ సీఐ డి.రాము తెలిపారు. మధ్యాహ్ననానికి జెట్టీ సమీపంలో గోడ వద్ద దుర్యోధన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, సంతబొమ్మాళి తహసీల్దార్ హేమసుందరరావు, రూరల్ సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నౌపడా ఎస్‌ఐ నారాయణస్వామి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మిన్నంటిన రోదనలు..
అందివచ్చిన కొడుకులు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భావనపాడు తీరంతో పాటు టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద బిడ్డల మృతదేహాలను చూసి దుర్యోధన తల్లి సీతమ్మ, తండ్రి మాధవరావు, జశ్వంత్ తల్లి సుధ, తండ్రి వల్లభరావు, రాజేష్ తల్లి జ్యోతి, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ముగ్గురు యువకుల మృతితో వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.