Traffic problems: పలాసలో ప్రయాణం.. పద్మవ్యూహమే
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:21 AM
Palasa traffic Road blockages పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. పేరుకు 80 అడుగుల రహదారి. కానీ రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

వెంటాడుతున్న ట్రాఫిక్ సమస్య
రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాల పార్కింగ్
ప్రజలకు తప్పని ఇబ్బందులు
కాశీబుగ్గ మూడు రోడ్ల జంక్షన్ వద్ద ట్రాఫిక్ దుస్థితి ఇదీ(పైచిత్రం). ఇతర గ్రామాలకు వెళ్లడానికి ఇదే ప్రధాన దారి కావడంతో నిత్యం వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. కొంతమంది భారీ వాహనాలు తీసుకువచ్చి రోడ్డుపైనే పార్కింగ్ చేసి సరకులు అన్‌లోడ్ చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే స్థానిక హోటల్స్ వద్ద పార్కింగ్‌కు అవకాశం లేకపోవడంతో రోడ్లుపైనే వాహనాలు నిలిపేస్తున్నారు. దీంతో నిత్యం ప్రజలు గంటలకొద్దీ ట్రాఫిక్‌లో ఇరుక్కొంటూ నరకాన్ని చూస్తున్నారు. (8పీఎల్‌ఎస్‌పి6)
పలాస, జూన్ 9(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. పేరుకు 80 అడుగుల రహదారి. కానీ రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషర్‌రోడ్, కాశీబుగ్గ మూడురోడ్ల జంక్షన్, శ్రీనివాసలాడ్జి జంక్షన్, ఇందిరాచౌక్, ఎస్‌బీఐ జంక్షన్ వద ్దపరిస్థితి దారుణంగా ఉంది. ఈ మార్గాల్లో రాకపోకలు సాగించాలంటే.. పద్మవ్యూహాన్ని ఛేదించినట్టేనని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పలాస-కాశీబుగ్గలో రైల్వేస్టేషన్ రోడ్డు పేరుచెబితే వాహనదారులు హడలిపోతున్నారు. ముఖ్యమైన రైళ్లే వచ్చే వేళలు ఉదయం 8 గంటల లోపు, మధ్యాహ్నం 11 నుంచి 1 గంట, సాయంత్రం 4 నుంచి 7గంటల వరకూ వాహనాలు రోడ్డుపైనే బారులుదీరుతున్నాయి. స్టేషన్ నుంచి వచ్చే ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు రోడ్డుపైకి రాగానే కేటీ రోడ్డు జంక్షన్ వద్ద కనీసం అరగంట సమయమైనా ఆగాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డుపై వాహనాలు పెడుతుండడంతో స్టేషన్ నుంచి బయటకు వెళ్లాల్సిన వాహనాలకు దారి లేకుండా పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాంధీనగర్‌లో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేసేస్తున్నారు. వాస్తవానికి ఇది 40 అడుగుల వెడల్పుతో కాశీబుగ్గలో ఉన్న ఏకైక రహదారి. ఇటీవల ఆక్రమణలు తొలగించి రోడ్డు వెడల్పు చేశారు. ఈ మార్గంలో ఆసుపత్రులు, బ్యాంకులు, భారీ మాల్స్, పాఠశాలలు ఉన్నాయి. కాగా నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో మళ్లీ ఇబ్బందులు తప్పడం లేదు.
పలాసలోని ఎస్‌బీఐ రోడ్డులోనూ ఇదే దుస్థితి. అసలే ఇరుకైన రహదారి, దీనికి తోడు మొత్తం నాలుగు బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు ఇక్కడే ఉన్నాయి. 20 అడుగుల వెడల్పు ఉండే ఈ రోడ్డుపైనే పార్కింగ్ చేస్తు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యం ప్రజలు ఇక్కడ పార్కింగ్ కష్టాలు చూడాల్సి వస్తోంది.
కేటీ రోడ్డులో ఎక్కడ చూసినా వాహనాలు పార్కింగ్ చేసి దర్శనమిస్తూనే ఉంటాయి. రోడ్డుకు ఇరువైపులా పది అడుగుల మేర పార్కింగ్ చేస్తున్నారు. ఉన్న 60 అడుగుల స్థలం కూడా అవసరం కొద్దీ రోడ్డుపైనే వాహనాలు బారులుతీరుతాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ తీవ్ర ట్రాఫిక్ ఉంటోంది. అటువంటి సమయంలో వాహనాలు రోడ్డుపైనే ఉండడంతో ప్రజలు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. శ్రీనివాసలాడ్జి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ఇదే పరిస్థితి ఉంది. పోలీసులు దీనిపై దృష్టి సారించి.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.