బొమ్మలే.. బోధనాస్త్రాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:54 PM
Versatile talent Appalaraja Master ఆ మాస్టార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన వేసే ఆకర్షణీయ బొమ్మలే బోధనాస్ర్తాలు. ఆయన ఏ స్కూల్‌లో పనిచేస్తే.. అక్కడ పాఠశాల ఆవరణ అంతా మొక్కల పచ్చదనంతో నిండి ఆహ్లాదంగా మారిపోతుంది. విద్యార్థుల్లో దేశభక్తి నింపేలా నినాదాలు కనిపిస్తాయి. ల్యాబ్‌లు, గ్రంథాలయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచుతారు. పుస్తకాల్లో ఉన్నది చెప్పడం కాదు. తానే స్వయంగా బొమ్మలు వేసి.. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో వాటిని బోధిస్తారు. ఇదీ పాతపట్నం ఏపీ మోడల్ స్కూల్‌లో బయాలజీ ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజు మాస్టార్ ప్రత్యేకత.
బహుముఖ ప్రజ్ఞాశాలి అప్పలరాజు మాస్టార్
మూడుసార్లు రాష్ట్రస్థాయి అవార్డులు
వినూత్న బోధనతో ఉత్తమ ఫలితాలు
మంత్రి నారా లోకేష్‌చే ప్రశంసలు
బల్లెడ అప్పలరాజు మాస్టార్ మీ కళాత్మక బోధనాశైలి చూడముచ్చటగా ఉంది. పాతపట్నంలోని ఏపీ మోడల్‌లో బోటనీ సబ్జెక్ట్ బోధిస్తూనే.. సహ ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను ఆకర్షణీయంగా, విజ్ఞానవతంగా తీర్చిదిద్దిన తీరు స్ఫూర్తినిస్తోంది. సైన్స్, మోరల్ వాల్యూస్, జనరల్ నాలెడ్జ్ ప్రతిబింబించేలా ల్యాబ్‌ను ఆర్టిస్టిక్‌గా రూపొందించి, నిర్వహిస్తున్న తీరు అభినందనీయం.
- ఇదీ ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో అప్పలరాజు మాస్టారుపై పెట్టిన ప్రశంసల పోస్టు.
పాతపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆ మాస్టార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన వేసే ఆకర్షణీయ బొమ్మలే బోధనాస్ర్తాలు. ఆయన ఏ స్కూల్‌లో పనిచేస్తే.. అక్కడ పాఠశాల ఆవరణ అంతా మొక్కల పచ్చదనంతో నిండి ఆహ్లాదంగా మారిపోతుంది. విద్యార్థుల్లో దేశభక్తి నింపేలా నినాదాలు కనిపిస్తాయి. ల్యాబ్‌లు, గ్రంథాలయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచుతారు. పుస్తకాల్లో ఉన్నది చెప్పడం కాదు. తానే స్వయంగా బొమ్మలు వేసి.. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో వాటిని బోధిస్తారు. ఇదీ పాతపట్నం ఏపీ మోడల్ స్కూల్‌లో బయాలజీ ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజు మాస్టార్ ప్రత్యేకత. లఘు చిత్రాలు కూడా రూపొందించడం ఆయనకున్న మరో విశిష్టత. ఆయన ప్రతిభకు ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రస్థాయి అవార్డులు దక్కగా.. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి ప్రశంసలు దక్కడం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
అప్పలరాజు మాస్టారు 2013 నుంచి 2017 వరకు జి.సిగడాంలో ఆదర్శ పాఠశాలలో పనిచేశారు. తర్వాత 2017 నుంచి 2022 వరకు రాజాం సమీపాన పెరుమాళలో విధులు నిర్వర్తించారు. 2022 నుంచి పాతపట్నం ఆదర్శ పారశాలలో పనిచేస్తున్నారు. ఈయన పనిచేసే ప్రతిచోటా వినూత్న బోధన సాగిస్తున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచి.. పచ్చదనం నింపేలా కృషి చేశారు. పాఠశాలల గోడలపై దేశభక్తి నినాదాలు రాయించి విద్యార్థుల్లో దేశభక్తిని నింపారు. పాఠశాలలోని గ్రంథాలయాలు, ఇంగ్లిష్ తదితర ల్యాబ్‌ల్లో వివిధ పితామహులు, శాస్త్రవేత్తల చిత్రాలను, మొక్కల యొక్క హెర్బేరియంలను ఆకర్షనీయంగా అలంకరించి విద్యార్థులకు ఉప యోగపడేలా తీర్చిదిద్దారు. అందుకే ఆయన పనిచేసే ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ.. ఇది అప్పలరాజు మాస్టార్ బ్రాండ్ స్కూల్ అని ముద్రవేస్తారు.
మూడుసార్లు రాష్ట్రస్థాయి అవార్డులు
రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(విజయవాడ) సంస్థ ఏటా డిసెంబరు 14 నుంచి 20 వరకు ఎనర్జీ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో వరుసగా మూడుసార్లు తానుతీసిన లఘు చిత్రాలకు అప్పలరాజు మాస్టారు రాష్ట్రస్థాయి అవార్డులు పొందారు. ఎనర్జీ కన్జర్వేషన్ ప్రధానాంశంగా-1,2,3 చిత్రాలు ఏటా రాష్ట్రస్థాయి గుర్తింపునిస్తూనే ఉన్నాయి. ఒకప్పటి జెన్‌కో ఎమ్‌డీ, ప్రస్తుత చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా 2022లో ప్రథమ బహుమతిగా రూ.20వేలు, 2023లో తృతీయ బహుమతి రూ5వేలు, 2024లో కన్సోలేషన్ బహుమతిగా రూ.2వేలు నగదు ప్రోత్సాహకం పొందారు.
శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో గతేడాది సెప్టెంబరు 5న కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతులమీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.
ఈ ఏడాది రాష్ట్ర బెస్ట్ పెర్ఫార్మెన్స్ టీచర్‌గా రాష్ట్ర ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా అభినందిచడం ఆనందంగా ఉందని అప్పలరాజు మాస్టార్ తెలిపారు. ఇదే స్ఫూర్తితో బోధన సాగిస్తూ.. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తానని వెల్లడించారు.