Share News

Industrial: పారిశ్రామికాభివృద్ధి దిశగా..

ABN , Publish Date - May 25 , 2025 | 11:36 PM

Industrial policy రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి పడకేసింది. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం లభించక.. ఎటువంటి రాయితీలు వర్తించక.. చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎంతోమంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటు కార్మికులకు ఉపాధితోపాటు.. అటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తోంది.

 Industrial: పారిశ్రామికాభివృద్ధి దిశగా..
మూలపేట పోర్టు

  • మూలపేట పోర్టు పరిసరాల్లో గ్రీన్‌అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమ

  • మూడు దశల్లో రూ.10వేల కోట్ల పెట్టుబడికి ఎంవోయూ

  • పలాసలోనూ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు

  • సంతబొమ్మాళి/ పలాస, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికాభివృద్ధి పడకేసింది. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం లభించక.. ఎటువంటి రాయితీలు వర్తించక.. చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ఎంతోమంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటు కార్మికులకు ఉపాధితోపాటు.. అటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు పరిసరాల్లో గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. అలాగే పలాసలో ఎంఎస్‌ఎంఈ ఏర్పాటుకు ఇటీవల శంకుస్థాపన కూడా చేసింది. ఇక్కడ మరో పారిశ్రామికవాడ ఏర్పాటు కానుండడంతో వేలాది మందికి ఉపాధి దక్కనుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

  • మూలపేట పోర్టు పరిధిలో..

  • సంతబొమ్మాళి మండలంలోని మూలపేట గ్రీన్‌పోర్టు పనులు సాగుతున్నాయి. ఈ పోర్టును పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. పోర్టు పరిసరాల్లో మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటుకు కొన్ని సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సంస్థల ప్రతినిధులు మేఘవరం, మరువాడ పరిధిలో ఉన్న భూములను పరిశీలించారు. మండలంలోని ఈస్ట్‌కోస్టు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణం నిలిచిపోవడంతో అక్కడ ఉన్న 3300 ఎకరాలతోపాటు తంపర భూములు, ఉప్పు భూములు పదివేల ఎకరాలు సేకరించి పరిశ్రమల కోసం భూ బ్యాంక్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం పలుమార్లు అధికారులతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమీక్షించారు. పోర్టు నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా రూ.10వేల కోట్లతో గ్రీన్‌ అమ్మోనియా పరిశ్రమ ఏర్పాటు కానుంది. నెదర్లాండ్‌లో నిర్వహించిన హైడ్రోజన్‌ సమిట్‌-2025లో ఇటీవల ఇందుకు సంబంధించి భారత్‌కు చెందిన జునో జౌలె గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్‌ కంపెనీ అనుబంధ సంస్థ సెలెక్ట్‌ న్యూ ఎనర్జీస్‌ జీఎంబీహెచ్‌ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఏటా మిలియన్‌ టన్నుల గ్రీన్‌ అమ్మోనియా తయారు చేసేలా ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని సంస్థలు నిర్ణయించాయి. దీని ద్వారా ఇక్కడ ఎలకో్ట్రలసిస్‌ ద్వారా 180వేల టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ కూడా ఉత్పత్తి కానుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం రూ.10వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. సముద్ర నీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్‌నూ ఇందులోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎంఓయూపై జేజే గ్రీన్‌ ఎనర్జీ సంస్ద సీఈవో రాయపాటి నాగశరత్‌, సెలెక్ట్‌ న్యూ ఎనర్జీస్‌ జీఎంబీహెచ్‌ ఎండీ ఫెలిక్స్‌డేంజర్‌ సంతకాలు చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.

  • పలాసలో మరో పారిశ్రామికవాడ

  • రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పథకంలో భాగంగా పలాస మండలం రామకృష్ణాపురం రెవిన్యూ పరిధిలో 60.84 ఎకరాల్లో స్థలాలు కేటాయించారు. దీనికి ఈ నెల 8న ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేసిన విషయం విధితమే. కొత్త పారిశ్రామిక పార్కుతో పలాస నియోజకవర్గంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు స్థాపించుకోవడానికి మార్గం సుగమమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాకముందే పలాసలో మరో పారిశ్రామికవాడ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ సమీపంలో ఇంగిలిగాం వద్ద పారిశ్రామికవాడ ఏర్పాటైన విషయం విధితమే. అనేకమంది జీడి, జీడి ఆయిల్‌ వ్యాపారాలు కొనసాగిస్తూ వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తునున్నారు. కొత్త పారిశ్రామికవాడలో కూడా రూ.96కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులతో 76 పరిశ్రమలు స్థాపించడానికి వీలుగా ప్లాట్లు కేటాయించారు. 1500 మందికి ప్రత్యక్షంగా, 500 మంది కార్మికులకు పరోక్షంగా ఉపాధి కల్పించడానికి ఇక్కడ పారిశ్రామికవాడను తీర్చిదిద్దనున్నారు. పరిశ్రమలు స్థాపించుకునేవారికి సింగిల్‌విండో ద్వారా అనుమతులతోపాటు బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ధేశించారు. ప్లాస్టిక్‌ రీ సైక్లింగ్‌, ఇంజనీరింగ్‌ యూనిట్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, డ్రైవాష్‌ యూనిట్లు, ప్లాస్టిక్‌ ప్రొడక్ట్స్‌, పేపర్‌ ప్రొడక్ట్స్‌, ప్యాకింగ్‌ యూనిట్లతోపాటు జీడి పరిశ్రమలు ఏర్పాటవుతాయి. చిన్నపెట్టుబడిదారులకు ఈ పార్కులు ఎంతో వినియోగపడతాయి. పలాస జాతీయరహదారికి ఆనుకొని రామకృష్ణాపురానికి కిలోమీటరు దూరంలో ఈ పార్కును రూపొందించారు. పర్యావరణానికి హాని లేకుండా ఇక్కడ నెలకొల్పడం మరోవిశేషం. గత వైసీపీ ప్రభుత్వం పారిశ్రామికవాడకు రూపకల్పన చేసినా, 50 ఎకరాలు మాత్రమే మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం 60 ఎకరాల్లో రూపకల్పన చేసేలా ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి చేశారు. ఇప్పటికే స్థల సేకరణ చేయడంతో కొత్త పారిశ్రామికపార్కుకు మార్గం సుగమమైందని యువ పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • అభివృద్ధి చెందాలన్నదే ఆకాంక్ష

    పలాస నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పారిశ్రామికవాడను తీసుకువచ్చాం. ఇది పూర్తిగా నిండిపోతే మరో పారిశ్రామికవాడకు మార్గం లభిస్తుంది. వ్యాపారులు ముందుకు వచ్చి పరిశ్రమలు స్థాపించి తద్వారా యువతకు ఉపాధి ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికే జీడి పరిశ్రమల ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. కొత్త పరిశ్రమల స్థాపనతో కనీసం 1,500 మందికి ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నాం.

    - గౌతు శిరీష, ఎమ్మెల్యే, పలాస

Updated Date - May 25 , 2025 | 11:36 PM