పర్యాటకులూ.. జాగ్రత్త
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:49 PM
Marine Police warn to be vigilant on beaches సముద్ర తీరంలో ప్రతినెలా ఏదో ఒకచోట విషాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం కార్తీక మాసం వేళ.. నిత్యం సముద్ర తీర ప్రాంతాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు తీర ప్రాంతాల్లో పూజలు చేస్తుంటారు. ఆపై పిక్నిక్‌ల సందడి కూడా మొదలైంది. దీంతో యువత ఆనందానికి అవధులు లేవు. అయితే ఆనందం మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయి.
జిల్లావ్యాప్తంగా కార్తీకమాసం పిక్నిక్‌ల సందడి
బీచ్‌ల్లో అప్రమత్తంగా ఉండాలని మెరైన్ హెచ్చరికలు
పోలీసులు ఉన్నచోటే స్నానాలకు దిగాలని సూచన
- ఈ ఏడాది ఆగస్టు 6న సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దున్మ దుర్యోధన, తిమ్మల జశ్వంత్, రాయల రాజేష్ సరదాగా భావనపాడు సముద్రంలో స్నానానికి దిగారు. అలల ఉధృతిలో కొట్టుకుపోయి.. ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.
- అక్టోబరు 19న పొందూరు మండలం ఖాజీపేటకు చెందిన జగదీష్ అనే యువకుడు గార మండలం మొగదాలపాడు బీచ్‌లో గల్లంతయ్యాడు. పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు నలుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. సముద్ర స్నానం చేస్తున్న సమయంలో జగదీష్ గల్లంతయ్యాడు. తరువాత రోజు మృతదేహం తీరం ఒడ్డుకు వచ్చింది.
రణస్థలం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): సముద్ర తీరంలో ప్రతినెలా ఏదో ఒకచోట విషాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ప్రస్తుతం కార్తీక మాసం వేళ.. నిత్యం సముద్ర తీర ప్రాంతాల్లో భక్తుల కోలాహలం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు తీర ప్రాంతాల్లో పూజలు చేస్తుంటారు. ఆపై పిక్నిక్‌ల సందడి కూడా మొదలైంది. దీంతో యువత ఆనందానికి అవధులు లేవు. అయితే ఆనందం మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయి. గత అనుభవాల దృష్ట్యా యువత అప్రమత్తంగా ఉండకపోతే మూల్యం తప్పదు. అందుకే సముద్ర స్నానాల విషయంలో జిల్లా మెరైన్ పోలీసులు గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. సముద్రస్నానాలంటూ ఎక్కడిపడితే అక్కడ దిగితే చర్యలు తప్పవంటున్నారు.
18 చోట్ల స్నానాలు..
జిల్లాలోని 11 మండలాల్లో 193 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. 18చోట్ల సముద్రస్నానాలు చేసేందుకు అనుకూలం. కానీ ఎక్కడపడితే అక్కడ యువత సముద్ర స్నానాలకు దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలో కళింగపట్నం, భావనపాడు, అక్కుపల్లి శివసాగర్ బీచ్, బారువ బీచ్, డొంకూరు తీరానికి ఎక్కువగా పర్యాటకులు తరలివస్తుంటారు. కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకూ పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. సముద్రతీరంలో అలల ఉధృతికి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అందుకే గుర్తింపు, ఆపై మెరైన్ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్రస్నానాలకు దిగితే మంచిది. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను ఒంటరిగా పిక్నిక్‌కు పంపించడం చాలా ప్రమాదం. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు నదుల్లో నీటి ప్రవాహం కూడా పెరిగింది. నదీ తీర ప్రాంతాల్లో ఈత కూడా ఇబ్బందికరమేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
అరకొరగా సిబ్బంది
రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ తీర ప్రాంత పరిరక్షణ మెరైన్ పోలీసుల బాధ్యత. కానీ జిల్లాలో కేవలం భావనపాడు, కళింగపట్నం, బారువలో మాత్రమే మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. సిబ్బంది అరకొరగానే ఉన్నారు. ఒక్కో మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలతో పాటు ఇతర సిబ్బంది 40 మంది వరకూ ఉండాలి. కానీ ఏ స్టేషన్‌లోనూ పది మంది సిబ్బంది కూడా లేరు. తీరంలో గస్తీ కోసం ఎటువంటి పరికరాలు, యంత్రాలు లేవు. వాస్తవానికి తీరంలోని మూడు కిలోమీటర్ల వరకూ మెరైన్ పోలీసులే గస్తీ కాయాలి. కానీ వారు తీరానికే పరిమితమైపోతున్నారు. ఆధునిక బైనాక్యులర్లు లేవు. తీరంలో వెళ్లేందుకు, పర్యవేక్షించేందుకు బోట్లు సైతం లేవు. అందుకే ఈ ఏడాది మెరైన్ పోలీస్ యంత్రాంగం ముందే మేల్కొంది. జిల్లావ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాల్లో మెరైన్ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్ర స్నానాలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.
డీఐజీ ఆదేశాలతో..
మెరైన్ పోలీసులు అందుబాటులో ఉన్నచోట మాత్రమే సముద్ర స్నానాలు చేయాలి. ఈ విషయంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు పాటిస్తూ పిల్లల కదలికలపై దృష్టి సారించాలి.
- ప్రసాదరావు, సీఐ, మెరైన్ పోలీస్‌స్టేషన్, కళింగపట్నం