మొంథా నష్టం రూ 1.24 కోట్లు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:13 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది.
- అధికారుల ప్రాథమిక అంచనా
- వరి పంటకు 15 మండలాల్లో ముప్పు
- ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్‌లో వివరాలు
శ్రీకాకుళం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షాలు, ఈదురుగాలల కారణంగా పలు శాఖలకు సంబంధించి మొత్తంగా రూ.1.24 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అత్యధికంగా ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌శాఖకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. 2,230.29 హెక్టార్లలో వరి పంట ముంపునకు గురైనట్లు అంచనా వేశారు. దీని నష్టం రూపాయల్లో నిర్ధారించాలంటే.. క్షేత్రస్థాయిలో సర్వే చేసి గణించాల్సి ఉంది. ఎకరాకు 33 శాతం పంట నష్టపోతేనే.. పరిహారం అందజేయనున్నారు. జిల్లాలో పదిహేను మండలాల్లోని 53 గ్రామాల్లో వరితోపాటు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఇచ్ఛాపురం మండలం అత్యధికంగా తుఫాన్ ధాటికి గురైంది. ఆ తర్వాత నందిగాం, పాతపట్టణం, టెక్కలి, సోంపేట, లావేరు, జి.సిగడాం, పలాస, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు, మందస, నరసన్నపేట, కొత్తూరు మండలాల్లో పంటలు పాడయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఇటు రోడ్లు.. ఇళ్లకు కూడా నష్టం వాటిల్లింది. శుక్రవారం రాత్రి వరకు 302 హెక్టార్ల మేర అధికారులు సర్వే చేశారు. పంట నష్టాన్ని ప్రభుత్వం తాజాగా రూపొందించిన ఏపీఏఐఎంఎస్ యాప్ 2.0లో వివరాలు పొందుపరిచారు. పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వం త్వరలో పరిహారం అందజేయనుంది.
అంచనా వేస్తున్నాం
జిల్లాలో మొంథా తుపాను నష్టాన్ని అంచనా వేస్తున్నాం. పంట నష్టాన్ని మండలాల వారీగా వ్యవసాయ రెవెన్యూ సిబ్బంది యాప్‌లో వివరాలు పొందుపరుస్తున్నారు. తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం.
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్