రేపు ‘అన్నదాత సుఖీభవ’
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:44 PM
Second term funds released అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. తొలివిడత జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు సైతం పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకూ ఈ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకోవాల’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
రెండో విడత నిధులు విడుదల
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. తొలివిడత జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు సైతం పరిశీలించి అర్హులైన ప్రతి రైతుకూ ఈ నిధులు జమయ్యేలా చర్యలు తీసుకోవాల’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, 26 జిల్లాల జేడీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 46,62,904 మంది రైతులకు రూ.3077.77కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నాం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు రూ.5వేలు మొత్తం రూ.7వేల చొప్పున రైతులు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఈ పథకం ద్వారా చేయూతనివ్వడం భారం కాదు బాధ్యత. ఎన్‌పీసీఏలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను యాక్టివేట్ చేయాలి. అర్హులైన రైతులు చనిపోతే.. వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తింపజేయాలి. వ్యవసాయశాఖ కిందిస్థాయి సిబ్బంది గ్రామాల్లోకి వెళ్లి పథకం గూర్చి రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాల’ని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. తమ పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కొందరు, గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు నిలుపుదల చేశారని మరికొందరు, నూతన గృహాలు మంజూరు, రహదారులు ఏర్పాటు చేయాలని ఇంకొందరు వినతులు అందజేశారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇల్లు లేనివారికి త్వరలో గృహాలు మంజూరు చేస్తామని, ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.