Toll charge: టోల్ చార్జి.. ఏడాదికి రూ.3వేలు మాత్రమే
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:44 PM
Relief for motorists with toll exemption పలాస నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే లక్ష్మిపురం(పలాస), మడపాం(నరసన్నపేట), నాతవలస(పూసపాటిరేగ) వద్ద ఉన్న మొత్తం మూడు టోల్‌గేట్లు దాటాలి. ఇందుకు మొత్తం ఒకసారి రానుపోను టోల్‌గేట్లు చార్జీలకు రూ.600 వరకూ వాహనదారులకు ఖర్చవుతోంది.
ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు
ఏ టోల్‌గేటు నుంచైనా రాకపోకలకు అవకాశం
మినహాయింపుతో వాహనదారులకు ఊరట
పలాస, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పలాస నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే లక్ష్మిపురం(పలాస), మడపాం(నరసన్నపేట), నాతవలస(పూసపాటిరేగ) వద్ద ఉన్న మొత్తం మూడు టోల్‌గేట్లు దాటాలి. ఇందుకు మొత్తం ఒకసారి రానుపోను టోల్‌గేట్లు చార్జీలకు రూ.600 వరకూ వాహనదారులకు ఖర్చవుతోంది. ఈ లెక్కన జిల్లాలో చాలామంది వాహనదారులపై టోల్ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో టోల్ భారం తగ్గించేలా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడాదికి కేవలం రూ.3వేలు చెల్లిస్తే చాలు.. ఒక్క విశాఖపట్నం వరకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం టోల్‌గేట్లలో ఎటువంటి రుసుం చెల్లించకుండా ప్రయాణించేలా అవకాశం కల్పింనుంది. ఈ నెల 15 నుంచి ఈ విధానం అమలు చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టోల్‌చార్జీల మినహాయింపుతో ఉద్యోగ, వ్యాపారం, సొంత అవసరాల కోసం జాతీయరహదారిపై ప్రయాణించేవారికి ఊరట కలుగనుందని పేర్కొంటున్నారు.
వార్షిక పాస్ పేరుతో ఈ పథకాన్ని ఫాస్ట్‌ట్యాగ్ వినియోగించే వారికి పూర్తిగా వినియోగపడుతోంది. దీన్ని రాజ్‌మార్గ్‌యాత్ర అనే మొబైల్ యాప్ లేదా జాతీయరహదారుల అథారిటీ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికార వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు మాత్రం డేటాబేస్‌లో నమోదై ఉండాలి. వాహనాలకు అనుసంధానం చేసిన ఫాస్ట్‌ట్యాగ్ వివరాలు, రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా మొబైల్ యాప్/వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. నగదు చెల్లించిన రెండు మూడు గంటల్లోగా వార్షిక పాస్ అమలులోకి వస్తుంది. ఇవన్నీ కేవలం ప్రైవేటు వాహనాలకు మాత్రమే. ట్యాక్సీలు, కమర్షియల్ వాహనాలు, ప్రభుత్వ వాహనాలకు ఈ నిబంధన వర్తించదు. ఒక వాహనానికి జారీచేసిన ఫాస్ట్‌ట్యాగ్ మరో వాహనానికి వర్తించదు. వాహనాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన మేరకే రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆధారంగా వీటిని జారీ చేస్తారు. ప్రజల ఖర్చులను తగ్గించడానికి కేంద్రం ఆలోచన మేరకే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండడం విశేషం. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న ప్రైవేటు వాహనాలకు టోల్‌మినహాయింపు జరగడంతో పాటు రూ.వేలల్లో నగదు ఆదా అయ్యే అవకాశం ఉంది.