Share News

Ekadashi: తొలి ఏకాదశి... శుభాల రాశి

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:10 AM

Devotional significance తొలి ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ఆలయాలు ముస్తాబయ్యాయి.

Ekadashi: తొలి ఏకాదశి... శుభాల రాశి

  • నేటి నుంచే విష్ణుమూర్తి యోగనిద్ర

  • ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

  • నరసన్నపేట, జూలై 5(ఆంధ్రజ్యోతి): తొలి ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం హిరమండలంలోని కూర్మ ఆధ్యాత్మిక గ్రామం, శ్రీకూర్మం, శ్రీకాకుళం పీఎన్‌కాలనీలోని నారాయణ తిరుమల... నరసన్నపేటలోని శ్రీ వేంకటేశ్వర, సత్యనారాయణస్వామి దేవాలయం, టెక్కలి, సోంపేట, కాశీబుగ్గ, ఆమదాలవలసలోని విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

  • ఏకాదశిలు నెలకు రెండు చొప్పున వస్తుంటాయి. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేకత ఉంది. ప్రస్తుతం చైత్రశుద్ధ పాఢ్యమిని సంవత్సర ఆరంభంగా.. తెలుగు సంవత్సరాది (ఉగాది)గా జరుపుకుంటున్నాం. కానీ.. గతంలో ఆషాఢ శుక్ల ఏకాదశిని సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిల్లో ఇది మొదటిగా ఉండేది. అందుకే దీనిని తొలి ఏకాదశి అంటారు. తొలి ఏకాదశికి ఆధ్యాత్మికపరంగాను, ఆరోగ్యపరంగాను అనేక విశిష్టతలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఆధ్మాత్మికవేత్తలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ రోజు నుంచే నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను చేపడతారు. ఇక అనేక పండుగలకు ప్రారంభం కూడా తొలి ఏకాదశి నుంచే జరుగుతుంది. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఆ రోజు శ్రీమహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అంటే నాలుగు నెలల తర్వాత ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే దాన్ని ఉత్థాన ఏకాదశిగా పిలుస్తారు. తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించటం... విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఎంతో ఉత్తమమని చెబుతారు. తొలి ఏకాదశి రోజు నుంచే గ్రహ గమనాల్లో మార్పులు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. అందుకే పగలు తక్కువగా ఉండి... రాత్రి సమయం పెరుగుతుంది. ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన తొలి ఏకాదశి పండుగను సర్వపాపాలను హరించే పుణ్యరాశిగా పేర్కొంటారు.

Updated Date - Jul 06 , 2025 | 12:10 AM