Share News

Teacher transfers: నేడే ఆఖరు

ABN , Publish Date - May 27 , 2025 | 12:09 AM

Teacher transfers: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది.

Teacher transfers: నేడే ఆఖరు

- ముగియనున్న ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తు ప్రక్రియ

- తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు

- పరిష్కారానికి ఎంఈవో లాగిన్‌లో అవకాశం

- తరువాత డీఈవో కార్యాలయానికి దరఖాస్తులు

నరసన్నపేట, మే 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎస్జీటీలకు అవకాశం కల్పించారు. ఆ తరువాత సర్వర్‌ ఆగిపోనుంది. ఈనెల 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు 121 మంది, స్కూల్‌ అసిస్టెంట్లు సుమారు 600 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్ల దరఖాస్తు పక్రియ దాదాపు ముగిసింది. ఎస్జీటీలకు మాత్రం మంగళవారం అర్ధరాత్రితో ముగియ నుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని కేటగిరీలకు చెందిన సుమారు 4,700 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేయనున్నారు. ఎస్జీటీలు వేల సంఖ్యలో ఉండడంతో అంతా ఒకేసారి దరఖాస్తు చేస్తున్నారు. దీంతో సర్వర్‌ డౌన్‌ అవుతుండడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు సమయంలో ఏర్పడే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మార్సీ కార్యాలయాల్లో ఎంఈవో లాగిన్‌లో అవకాశం ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయులకు కొంత ఊరట లభించింది. దరఖాస్తుతో పత్రాలతో ఫ్రిపెరెన్సీయల్‌ కేటగిరీలోని ఉపాధ్యాయులు ఇటీవల మెడికల్‌ బోర్డు జారీ చేసిన పత్రాలు జత చేయాల్సి ఉంది. అలాగే ఉపాధ్యాయుల సర్వీసు రిజిస్టర్‌లో కూడా నమోదు చేసింది లేదానే విషయాన్ని ధ్రువీకరించిన తరువాత వాటిని ఎంఈవోలు ఆమోదించాల్సి ఉంది. అలాంటి దరఖాస్తులను ప్రత్యేకంగా సిద్ధం చేసి డీఈవో కార్యాలయానికి పంపించాల్సి ఉంది. బదిలీల్లో ఉపాధ్యాయుల ప్రత్యేక కేటగిరీ కోసం అడ్డుదారులు తొక్కకుండా ముందుగుండానే అధికారులు చెక్‌ పెట్టారు. అయినా కొందరు ఉపాధ్యాయులు తమ పలుకుబడి ఉపయోగించుకుని మెడికల్‌ బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బదిలీల దరఖాస్తును పునఃపరిశీలన కోసం డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Updated Date - May 27 , 2025 | 12:09 AM