Share News

Transporting marijuana: గంజాయితో రైల్వేస్టేషన్‌కు..

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:51 PM

Transporting marijuana: ఒడిశా నుంచి సూరత్‌కు గంజాయిని రవాణా చేసేందుకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.

Transporting marijuana: గంజాయితో రైల్వేస్టేషన్‌కు..
వివరాలు వెల్లడిస్తున్న సీఐ

- పట్టుకున్న పోలీసులు

- 29 కేజీలు స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

ఇచ్ఛాపురం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి సూరత్‌కు గంజాయిని రవాణా చేసేందుకు ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 29 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో సీఐ మీసాల చిన్నమనాయుడు విలేకరులకు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పటాపూర్‌ గ్రామానికి చెందిన సంజుక్తదాస్‌ అనే మహిళ గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ పాండెసర్‌లో ఉండేది. ఈ సమయంలో తన భర్త స్నేహితుడైన గంజాయి వ్యాపారం చేసే రంజాన్‌ ప్రధాన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదే విధంగా మరో గంజాయి వ్యాపారి సచిన గ్రామానికి చెందిన కునిపండాతో కూడా పరిచయం ఏర్పడింది. అయితే, సంజుక్తదాస్‌ భర్త చనిపోయిన తరువాత ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో ఆమె గంజాయి వ్యాపారులైన రంజాన్‌ప్రధాన్‌, కునిపండాను కలిసి డబ్బు సాయం కోరింది. ఈ నేపథ్యంలో ముగ్గురూ కలిసి గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పలుమార్లు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి సూరత్‌కు తరలించారు. ఇదే విధంగా బుధవారం కూడా సంజుక్తదాస్‌తో పాటు పటాపూర్‌ గ్రామానికి చెందిన లోక్‌నాథ్‌ ప్రధాన్‌ ఒడిశాలో 29కేజీల గంజాయిని కొనుగోలు చేసి బస్సు మార్గంలో ఇచ్ఛాపురం పట్టణానికి చేరుకున్నారు. అక్కడ నుంచి స్థానిక రైల్వే స్టేషన్‌కు వచ్చారు. రైలులో సూరత్‌ వెళ్లి రంజాన్‌ ప్రధాన్‌కు గంజాయిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పట్టణ ఇన్‌చార్జి ఎస్‌ఐ రవివర్మ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన సంజుక్తదాస్‌, లోక్‌నాథ్‌ ప్రధాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. గంజాయి సీజ్‌ చేయటంతో పాటు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రవివర్మ పాల్గొన్నారు

Updated Date - Nov 26 , 2025 | 11:51 PM