పొలం వెళ్లాలంటే.. గెడ్డ దాటాల్సిందే
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:16 AM
Overflowing Bahuda ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరు బాహుదా నది పొంగి ప్రవహిస్తుండడంతో.. బూర్జపాడు గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు వరదనీరు పోటెత్తి పొలాలు ముంపునకు గురవుతున్నాయి.
పొంగి ప్రవహిస్తున్న బాహుదా
బిక్కుబిక్కుమంటున్న బూర్జపాడు రైతులు
ఏటా తప్పని ముంపు సమస్య
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 6(ఆంరఽధజ్యోతి): ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరు బాహుదా నది పొంగి ప్రవహిస్తుండడంతో.. బూర్జపాడు గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు వరదనీరు పోటెత్తి పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడులో దాదాపు 1,000 ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 800 ఎకరాల పొలాలు నడిమిగెడ్డ, నాసిగెడ్డ అవతల ఉంటాయి. ఇవి బాహుదా నదికి అనుసంధానంగా ఉంటాయి. బాహుదాకు వరదలు వస్తే ఈ రెండు గెడ్డలు పొంగి ప్రవహిస్తాయి. దీంతో బూర్జపాడు ఆయకట్టు 800 ఎకరాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అందుకే వ్యవసాయ పరికరాలు, యంత్రాలను ముందుగానే పొలాలకు తరలిస్తారు. జూన్‌లోనే వరి విత్తనాలు వేసిన సమయంలో ట్రాక్టర్లు, దమ్ముసెట్లు, ఇతర పరికరాలను తరలిస్తారు. మనుషులు అత్యంత ప్రమాదకర స్థితిలో గెడ్డలు దాటుతుంటారు. ఆ సమయంలో ప్రమాదం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ గెడ్డలపై కాజ్‌వేలు, వంతెనలు నిర్మిస్తామన్న పాలకుల హామీ కార్యరూపం దాల్చడం లేదు.
ఇదీ పరిస్థితి..
బాహుదా నది.. ఒడిశాలో పుట్టి ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో 12 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. ఇచ్ఛాపురం పట్టణంతోపాటు మరో 30 గ్రామాలకు ప్రధాన సాగునీటి ఆధారం బాహుదే. కానీ నదికి సంబంధించి సరైన నిర్వహణ లేదు. నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, గత పాలకుల తప్పిదాలు, నదిలో నీటి ప్రవాహం మార్పులు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒడిశా ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు.. సరిహద్దున ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మన భూభాగంలో 18 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 11 ఓపెన్ హెడ్ చానల్స్‌కు కనీసం మరమ్మతులు చేయలేకపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. దీంతో పంట కాలువలు, గ్రోయిన్లు, రాతికట్టడాలకు రైతులే సొంతగా నిధులు వేసుకొని బాగు చేసుకునేవారు. బాహుదా ఆయకట్టు పరిధిలో 750 చెరువులు ఉన్నాయి. వాటికి నది నీటిని మళ్లించాలి. వరద పోటు తీరం, పంట పొలాలపై పడకుండా చిన్నపాటి కరకట్టలు నిర్మించాలి. బూర్జపాడు లాంటి పంచాయతీలు చాలా ఉన్నాయి. నది అవతల ప్రాంతంలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అందుకే నదితో పాటు సమీప గెడ్డలపై కాజ్‌వేలు, కల్వర్టులు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ప్రాణాలకు తెగిస్తున్నాం
పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి వెళ్లాల్సిందే. నడుంలోతులో గెడ్డలను దాటుతున్నాం. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నాం. కాజ్‌వే నిర్మించాలని దశాబ్దాలుగా అడుగుతున్నా పట్టించుకునే నాథుడు లేరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి.
- పులకల హరికృష్ణ, రైతు, బూర్జపాడు
ఏటా ఇదే పరిస్థితి
గెడ్డలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వర్షాకాలంలో వరద నీరు పొంగుతోంది. ఏటా ఇదే పరిస్థితి. అందుకే ముందస్తుగానే పొలాల్లో వ్యవసాయ పరికరాలు, యంత్రాలు చేర్చుతాం. మళ్లీ సంక్రాంతి తరువాత తెచ్చుకుంటాం. పక్కనే పొలాలు ఉన్నా చూడలేని పరిస్థితి మాది.
- పి.పురుషోత్తం, రైతు, బూర్జపాడు