Share News

ఇంకెన్నాళ్లు?

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:55 PM

Tidco house పట్టణ ప్రజల సొంతింటి కల నెరవేరడం లేదు. దశాబ్ద కాలం అవుతున్నా టిడ్కో ఇళ్లు పూర్తికావడం లేదు. దీంతో పట్టణాల చెంతనే టిడ్కో ఇళ్లు దిష్టిబొమ్మాల్లా దర్శనమిస్తున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి టీడీపీ హయాంలో పునాది పడింది.

ఇంకెన్నాళ్లు?
ఇచ్ఛాపురం ఏఎస్‌ పేటలో దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న టిడ్కో గృహాలు

  • పూర్తికాని టిడ్కో ఇళ్ల నిర్మాణం

  • దశాబ్ద కాలంగా లబ్ధిదారుల ఎదురుచూపు

  • అద్దెలు, రుణాల చెల్లింపు భారంతో ఇబ్బందులు

  • ఇచ్ఛాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల సొంతింటి కల నెరవేరడం లేదు. దశాబ్ద కాలం అవుతున్నా టిడ్కో ఇళ్లు పూర్తికావడం లేదు. దీంతో పట్టణాల చెంతనే టిడ్కో ఇళ్లు దిష్టిబొమ్మాల్లా దర్శనమిస్తున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి టీడీపీ హయాంలో పునాది పడింది. కానీ వైసీపీ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దృష్టి సారించినా.. పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని, ఇళ్లు ఎప్పుడు అప్పగిస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

  • ఇదీ పరిస్థితి..

  • జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదావలవలస మునిసిపాలిటీలు ఉన్నాయి. పట్టణంలో పేద ప్రజల కోసం 2014లో టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది. విపత్తులకు తట్టుకునే విధంగా వాటి నిర్మాణం పూర్తిచేయాలని భావించింది. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 3,536 టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి. ఇచ్ఛాపురం పట్టణంలో రూ.16.10కోట్లతో 192 ఇళ్లను, పలాస - కాశీబుగ్గలో రూ.65.20 కోట్లతో 912 ఇళ్లను, ఆమదాలవలసలో రూ.35.50 కోట్లతో 528 ఇళ్లను, శ్రీకాకుళం-1లో రూ.78.40 కోట్లతో 1,280 ఇళ్లను, శ్రీకాకుళం-2లో రూ.40.23 కోట్లతో 624 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకూ శ్రీకాకుళం-1లోని 1,280 ఇళ్లను మాత్రమే పూర్తిచేసి లబ్ధిదారులకు అందించారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చూపింది. లోపల పనులు పూర్తిచేయకుండానే బయట వైసీపీ రంగులతో నింపేసింది. దీంతో లబ్ధిదారులకు ఇళ్లు అందని ద్రాక్షగా మిగిలాయి. మరోవైపు లబ్ధిదారులు అద్దె గృహాల్లో కొనసాగుతున్నారు. అటు ఉన్న ఇంటికి అద్దె కడుతున్నారు. ఇటు టిడ్కో ఇంటికి సంబంధించి బ్యాంకు రుణాలు కట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఇంకెన్నాళ్లు తాము ఇళ్ల కోసం ఎదురుచూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమైన తమ ఇబ్బందులు గుర్తించి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి తమకు అప్పగించాలని కోరుతున్నారు.

  • కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి పెండింగ్‌ పనులతోపాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. పెండింగ్‌ నిధులు విడుదల చేయడంతో పనులకు మోక్షం కలిగింది. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలసలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. అక్కడక్కడా ప్యాచ్‌వర్క్‌లు పూర్తిచేయాల్సి ఉంది. ప్రస్తుతం టిడ్కో గృహాల సముదాయం రహదారులు, కాలువలు, విద్యుత్‌, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి పనులు పూర్తిచేసి.. లబ్ధిదారులు ఇళ్లు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

  • త్వరితగతిన పనులు

  • వచ్చే ఏడాది మార్చి నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. శ్రీకాకుళం-2లో తప్ప అన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మౌలిక సదుపాయాలను మాత్రమే కల్పించాల్సి ఉంది. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి.

  • - బి.హరి, డీఈఈ, టిడ్కో విభాగం

Updated Date - Nov 20 , 2025 | 11:55 PM