Share News

Sound pollution: శబ్దాల దడ

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:32 AM

Loud music Noise pollution జిల్లాలో కుర్రకారు హుషారు సామాన్య ప్రజలను ఇబ్బందుల్లో పెడుతోంది. ఒకవైపు డీజేల మోత.. మరోవైపు సైలెన్సర్ల ద్వారా భారీ శబ్దాన్ని ఇచ్చే బైక్‌లు అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడేవారికి డీజేలు, బైక్‌ల శబ్దాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి.

Sound pollution: శబ్దాల దడ

  • డీజేలతో అలజడి

  • బైకులతో కుర్రకారు ఫీట్లు

  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు గండం

  • పట్టించుకోని యంత్రాంగం

  • ఇచ్ఛాపురం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కుర్రకారు హుషారు సామాన్య ప్రజలను ఇబ్బందుల్లో పెడుతోంది. ఒకవైపు డీజేల మోత.. మరోవైపు సైలెన్సర్ల ద్వారా భారీ శబ్దాన్ని ఇచ్చే బైక్‌లు అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడేవారికి డీజేలు, బైక్‌ల శబ్దాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వివాహాలు, శుభకార్యాలు, గ్రామదేవత పండుగలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా డీజేలు దర్శనమిస్తున్నాయి. శబ్దాల మోత మోగిస్తున్నాయి. అదే సమయంలో యువకులు బైకుల సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోత పుట్టిస్తున్నారు. దీంతో దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వాస్తవానికి డీజేలను నిషేధించినట్టు పోలీస్‌ శాఖ చెబుతున్నా.. ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.

  • సైలెన్సర్లు మార్చి..

  • రోడ్లపై మితిమీరిన వేగంతో, అధిక శబ్దంతో వెళ్తున్న వాహనాలు ఇటీవల ఎక్కువయ్యాయి. యువకులు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లను (పొగ గొట్టాలు) మార్చి.. భారీ శబ్దాలనిచ్చే వాటిని అమరుస్తున్నారు. వైల్డ్‌బోర్‌, కాక్‌టైల్‌ షార్మర్‌, డాల్ఫిన్‌, మెగాఫోన్‌, టెయిల్‌గన్నర్‌ వంటి రకరకాల పేరుతో వచ్చే సైలెన్సర్లు భారీ శబ్దాన్నిస్తాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ.10వేల నుంచి రూ.23వేల వరకూ పలుకుతోంది. అనుసంధానంగా ఇతరత్రా పరికరాలు అమర్చేందుకు మెకానిక్‌కు మరో రూ.3 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. వీటి ధర అధికమైనా కుర్రకారు లెక్క చేయడం లేదు. ఆరోగ్యానికి హానికరమైనా, పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నా, పోలీసులు హెచ్చరిస్తున్నా.. బేఖాతరు చేస్తున్నారు. వాస్తవానికి వీటి వాడకం చట్ట విరుద్ధం. పోలీసులకు పట్టుబడితే భారీ జరీమానాతోపాటు జైలు శిక్ష పడుతుంది. కానీ సరికొత్త సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్ధానికి ఎక్కువ మంది యువత ఆకర్షితులవుతున్నారు. బైక్‌లతో రోడ్డెక్కి చుట్టు పక్కల వాహనదారుల గుండెల్లో అలజడి రేపుతున్నారు.

  • నిబంధనలు ఇవీ..

  • ఒక వాహనం నిర్ణీత డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం చేస్తే అది మోటారు వాహన చట్టం ప్రకారం నేరం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారుడిపై ఎంవీఐ యాక్ట్‌ 1988 సెక్షన్‌ 190(2) ప్రకారం పోలీసులు కానీ రవాణాశాఖ అధికారులు కానీ కేసు నమోదు చేయవచ్చు. సంబంధిత వాహనదారుడికి తొలిసారి అయితే రూ.1,000 జరీమానాతో పాటు కేసు నమోదు చేస్తారు. రెండోసారి పట్టుబడితే రూ.2 వేలు జరీమానాతో పాటు కఠిన చర్యలకు సిఫారసు చేస్తారు. మోటారు కంపెనీ ఉత్పత్తి చేసిన బైక్‌ను ఎట్టి పరిస్థితుల్లో విడి పరికరాలు మార్చకూడదు. ఇది చట్టరీత్యా నేరం.

  • అనర్థాలెన్నో..

  • శబ్దం తీవ్రత పెరిగే కొలదీ రుగ్మతలు ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 60 డెసిబుల్స్‌లోపు శబ్దం వింటే ఎటువంటి ఇబ్బందులుండవు. 100 డెసిబుల్స్‌ దాటితే గుండె జబ్బులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 110 నుంచి 120 డెసిబుల్స్‌ దాటితే చిరాకుతో పాటు విపరీతమైన కోపం, తలనొప్పి వస్తుంది. 160 డెసిబుల్స్‌ దాటితే చెవుల్లో వినికిడి కణాలపై ప్రభావం చూపుతాయి. నరాలు దెబ్బతిని పాక్షిక వైకల్యం కలుగుతుంది. 190 డెసిబుల్స్‌ శబ్దం దాటితే కర్ణభేరి పగిలిపోతోంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపు స్థితి రావడం చాలా కష్టమని వైద్యనిపుణులు చెబుతున్నారు.

  • డీజేలపై నిషేధం

  • అధిక శబ్ధం కలిగించే డీజేల వినియోగం నిషేధం. భారీ శబ్దం ఇచ్చే సైలెన్సర్లను వినియోగించడం నేరం. కళాశాల యువకులు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నట్టు తనిఖీల్లో తేలింది. పిల్లల కదలికపై, వారు వినియోగించే బైక్‌లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. అధిక శబ్దం ఇచ్చే సైలెన్సర్లను తొలగించకపోతే జరీమానాతోపాటు కేసులు నమోదుచేస్తాం. డీజేల వినియోగంపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం.

    - మీసాల చిన్నమనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం

    ...............

  • వ్యాధులపై ప్రభావం

  • ఎక్కువ డెసిబుల్‌ శబ్దం కలిగించే డీజేల శబ్దాలు, సైలెన్సర్లతో అనర్థాలు అధికం. వినికిడి లోపంతో పాటు మానసిక వ్యాధులు కలుగుతాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఈ శబ్ధం వింటే పెను ప్రభావం చూపుతుంది. చిరాకుతో పాటు విపరీతమైన కోపం, తలనొప్పికి సైలెన్సర్ల శబ్ధాలు కారణమవుతాయి. అందుకే యువత ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి.

    - డాక్టర్‌ ఉలాల కోదండరాము, కేజీహెచ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఇచ్ఛాపురం

Updated Date - Jun 09 , 2025 | 12:32 AM