కార్మికులపై పిడుగు
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:29 AM
మరో అరగంటలో పనులు ముగించుకుంటారు. ఇంటికి వెళ్లడానికి వారంతా సిద్ధమవుతున్నారు.
గ్రానైట్ క్వారీలో ఘోరం
ముగ్గురు కార్మికుల మృతి
మరో నలుగురికి గాయాలు
మెళియాపుట్టి/టెక్కలి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): మరో అరగంటలో పనులు ముగించుకుంటారు. ఇంటికి వెళ్లడానికి వారంతా సిద్ధమవుతున్నారు. ఇంతలో ఉరుములు.. మెరుపులతో కూడిన శబ్దాలు వినిపించాయి. బాంబులు పెట్టకుండానే ఆ శబ్దాలేంటీ అనుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అక్కడికక్కడే మూడు మృతదేహాలు పడిఉన్నాయి. మరి కొంతమంది గాయపడి ఉన్నారు. దీంతో కార్మికులంతా భీతిల్లిపోయారు. ఇదీ మెళియాపుట్టి మండలం గంగరాజపురం పంచాయతీ పరిధి రాజ్‌యోగ్ గ్రానైట్ క్వారీలో జరిగిన ఘోరం. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పిడుగుపడి బిహార్ రాష్ట్రానికి చెందిన శ్రావణ్‌కుమార్ (45), రాజస్థాన్ రాష్ట్రం జాగూర్ జిల్లా ముఖన గ్రామానికి చెందిన హేమరాజ్ (25), మధ్యప్రదేశ్‌కు చెందిన పింటు (30) అనే ముగ్గురు కార్మికులు అక్కడక్కడే మృతి చెందారు. మరో నలుగురు కార్మికులు టెక్కలి ఆదీఆంధ్రావీధికి చెందిన కాళ్ల జనార్థనరావు, మెళియాపుట్టి మండలం బందపల్లి గ్రామానికి చెందిన కరణం బాలరాజు పెద్దలక్ష్మీపురం గ్రామానికి చెందిన బైపోతు హరిప్రసాద్, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ పరిధి టంకసాయి గ్రామానికి చెందిన జాన్ బోనియాసింగ్ గాయపడ్డారు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్ బి.పాపారావు, పాతపట్నం సీఐ సన్యాసి నాయుడు, ఎస్‌ఐ మధుసూదనరావు పరిశీలించారు. టెక్కలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, సీఐ విజయ్‌కుమార్ పరామర్శించి ప్రమాద సంఘటనపై ఆరాతీశారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని జేసీ ఆదేశించారు. క్షతగాత్రుల బంధువులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని తమవారి పరిస్థితిపై ఆందోళనకు గురయ్యారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాతపట్నం సీఐ సన్యాసినాయుడు తెలిపారు.
నిరుపేద కుటుంబాలు..
పిడుగుపడి మృతి చెందిన శ్రావణ్‌కుమార్, హేమరాజ్, పింటులవి నిరుపేద కుటుంబాలు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. తమ రాష్ట్రాల్లో పనుల్లేక ఇక్కడకు వచ్చి గ్రానైట్ క్వారీలో రోప్‌కట్టర్లగా పని చేస్తున్నారు. వీరంతా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారైనా ఒకచోట కలిసి పని చేస్తుండడంతో స్నేహితులుగా మారారు. మృత్యువులోనూ ఈ బంధం వీడకపోవడంతో తోటి కార్మికులు కంటతడి పెడుతున్నారు. వీరి కుటుంబాలకు సమాచారం అందించినట్లు అధికారులు తెలుపుతున్నారు.
మూడు రోజుల కిందటే విధుల్లోకి..
బిహార్ రాష్ట్రానికి చెందిన శ్రావణ్‌కుమార్ రెండున్నర దశాబ్దాలుగా టెక్కలిలో నివశిస్తున్నాడు. ఈయన గత నెలాఖరు వరకూ టెక్కలి పరిధిలోని గ్యాలాప్ గ్రానైట్ క్వారీలో పనిచేసేవాడు. మూడురోజులు కిందటే ఈయన రాజ్‌యోగి క్వారీలో విధుల్లో చేరాడు. మంగళవారం సాయంత్రం క్వారీ ప్రాంతంలో పిడుగుపాటుకు గురై శ్రావణ్‌కుమార్ మృత్యువాతపడ్డాడు. శ్రావణ్‌కుమార్‌కు భార్య సరస్వతి, ఇద్దరు కుమార్తెలు నందిని, అపర్ణ, కుమారుడు సోమిత్‌కుమార్ ఉన్నారు. పెద్ద కుమార్తె తిరుపతి ఎస్‌వీ యూనివర్సిటీలో వెటర్నరీ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. చిన్న కుమార్తె గుజరాత్‌లోని వడేదరాలో ఇంజనీరింగ్ చదువుతుంది. కుమారుడు విశాఖలో ఇంటర్ చదువుతున్నాడు. భర్త మృతితో టెక్కలి శ్రీనివాస్‌నగర్‌లో ఉంటున్న భార్య సరస్వతి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
మంత్రి అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి
గ్రానైట్ క్వారీ వద్ద పిడుగుపాటుకు గురై ముగ్గురు కార్మికులు మృతిచెందడం, మరో నలుగురు గాయపడడంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు. టెక్కలి ఆసుపత్రి సూపరింటెండెంట్ బొడ్డేపల్లి సూర్యారావుతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
ఏం జరిగిందో?
రాజ్‌యోగ్ క్వారీలో ముగ్గురు కార్మికుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ పరిశ్రమల్లో రాయిని పేల్చేందుకు జిలిటిన్ స్టిక్‌ను వాడుతుంటారు. గతంలో కొన్ని పరిశ్రమల్లో జిలిటిన్ స్టిక్ పేలి పలువురు కార్మికులు మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఈ ఏడాది మే 16న దబ్బగూడ గ్రానైట్ పరిశ్రమలో ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, తొలుత పిడుగుపడి వీరు మృతి చెందినట్లు యాజమాన్యం తెలిపింది. తీరా అధికారులు, పోలీసులు దర్యాప్తు జరిపిన తరువాత రాయిని పేల్చేందుకు బాంబు పెట్టినప్పుడే పిడుగుపడడంతో పేలుడు జరిగి వారు మృతి చెందినట్లు తెలిసింది. దీనిపై ఇంకా విచారణ జరుగుతుంది. రాజ్‌యోగ్ క్వారీలో కూడా ఇదే విధంగా ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు మృతి చెందారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు ముగ్గురూ కట్టర్లగా పనిచేస్తున్నారు. బాంబులను అమర్చి పేల్చడంలో వీరు నిపుణులుగా తెలుస్తుంది. మంగళవారం కూడా రాయిని పేల్చే సమయంలో పిడుగుపడి ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవున్నాయి. ఏం జరిగిందనేది అధికారుల విచారణలో తేలనుంది. కాగా, ఈ క్వారీలో సుమారు 25 మంది వరకు ప్రతి రోజూ పనులు చేస్తుంటారు. అయితే, దసరా కోసం చాలామంది కార్మికులకు ఇళ్లకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో పెద్దప్రమాదమే తప్పినట్లు అయిందని అంతా అంటున్నారు.
క్వారీల్లో భద్రత డొల్ల
గ్రానైట్ క్వారీల్లో వరుస ప్రమాదాలు కార్మికులను హడలెత్తిస్తున్నాయి. క్వారీల్లో భద్రత డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పిడుగులు పడేటప్పుడు, బ్లాస్టింగ్ సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. క్వారీల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికులకు కొంత పరిహారం అందజేసి చేతులు దులుపుకుంటున్నాయి. పిడుగులు పడే సమయాల్లో ముందస్తుగా సెల్‌ఫోన్‌లకు సమాచారం వస్తున్నా క్వారీల యాజమాన్యాలు కార్మికులతో ఎందుకు పనులు జరిపిస్తున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి.