Share News

మృత్యు పిడుగులు!

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:32 PM

Lightning deaths on the rise జిల్లాలో పిడుగులు వణికిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ ఏడాది వేసవి నుంచి పిడుగుల మోత కొనసాగుతోంది. ఇటీవల పిడుగుపాటుకుగురై రైతులు, రైతు కూలీలే ఎక్కువగా మృత్యువాతపడ్డారు. మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి.

మృత్యు పిడుగులు!

  • జిల్లాలో పెరుగుతున్న పిడుగుపాటు మృతులు

  • బాధిత కుటుంబాలకు అందని పరిహారం

  • చంద్రన్న బీమా పునరుద్ధరించాలని విజ్ఞప్తి

  • ఇచ్ఛాపురం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి):

  • ఈ నెల 23న పిడుగుపాటుకు గురై కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన రెయ్యి మృతి చెందారు. వరి పొలాల్లో కలుపుతీస్తుండగా పిడుగు పడడంతో ప్రాణాలు కోల్పోయారు.

  • నాలుగు రోజుల కిందట కంచిలి మండలం డోల గోవిందపురం వద్ద పిడుగుపాటుకు గురై నాలుగు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రెండు గొర్రెలు, రెండు మేకలు చనిపోయాయి.

  • జిల్లాలో పిడుగులు వణికిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ ఏడాది వేసవి నుంచి పిడుగుల మోత కొనసాగుతోంది. ఇటీవల పిడుగుపాటుకుగురై రైతులు, రైతు కూలీలే ఎక్కువగా మృత్యువాతపడ్డారు. మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రస్తుతం పొలాల్లో ఎరువులు వేయడం, కలుపు తీయడం వంటి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో కొంతమందిని పిడుగులు బలిగొంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినా పిడుగుల అపాయం నుంచి ముప్పు తప్పించలేకపోతున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు పరిహారం దక్కడం లేదు. వైసీపీ పాలనలో జిల్లాలో వందలాది మంది పిడుగుపాటుకు గురై మృతిచెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఏ ఒక్కరికీ పూర్తిస్థాయిలో సాయం అందిన దాఖలాలు లేవు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా పరిహారాన్ని పునరుద్ధరించలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పేరిట పది రోజుల్లో మృతుల కుటుంబాలకు పరిహారం అందించేవారు. వాస్తవానికి పిడుగుపాటుతో మృతిచెందితే రూ.4లక్షల పరిహారం అందించాలి. ఒకవేళ 60 శాతం వైకల్యం దాటితే రూ.2 లక్షలు, 60 శాతంలోపు ఉంటే రూ.59 వేలు పరిహారంగా ఇవ్వాలి. అధికారులు నివేదికలు అందిస్తున్నా.. పరిహారం మాత్రం దక్కడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందజేయాలని కోరుతున్నారు. చంద్రన్న బీమా అయినా పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • పాపం కాపరులు

  • సాధారణంగా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ పిడుగుల తీవ్రత అధికంగా ఉంటుంది. ఏటా ఏప్రిల్‌ నాటికి రబీకి సంబంధించి పంటలు పూర్తవుతాయి. ఆ సమయంలో మేకలు, గొర్రెలు, ఆవులు మందలు వేసేందుకు పొలాలు అనుకూలం. పగలంతా పొలాల్లో మేతలు పెడతారు. రాత్రికి అక్కడే మందలు వేస్తారు. ఎంతటి వర్షమైనా.. ఉరుములు, మెరుపులు వచ్చిన పశువుల వద్దే కాపరులు ఉండాలి. ఆ సమయంలోనే ఎక్కువగా పిడుగుపాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతులు, గొర్రెల పెంపకందారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ పిడుగుపాటు ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సమాచారం ఇస్తోంది. ‘వజ్రపాత్‌’ యాప్‌ ద్వారా అప్రమత్తం చేస్తున్నా ఫలితం లేకపోతోంది. గొర్రెల పెంపకందారులకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చి అవగాహన కల్పిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

  • అరచేతిలో ప్రాణాలు..

  • పొలంలో మందలు వేసే సమయంలో మా ఆందోళన అంతాఇంతా కాదు. పశువులను పొలాల్లో విడిచిపెట్టి రావడం కుదరని పని. ఆ సమయంలో వర్షాలకు, ఈదురుగాలులకు వణికిపోతాం. మెరుపులు, ఉరుముల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. దేవుడి మీదే భారం వేస్తాం. అందుకే చాలామంది పశువుల పెంపకానికి దూరమవుతున్నారు.

    - నర్తు సోమయ్య, గొర్రెల కాపరి, ఇచ్ఛాపురం

Updated Date - Sep 28 , 2025 | 11:32 PM