Share News

పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:48 PM

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌)కు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు కానున్నాయి.

పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు
గజపతినగరం పీఏసీఎస్‌

విజయనగరం, జూన్‌30(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్‌)కు త్రిసభ్య కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు పర్సన్‌ ఇన్‌చార్జి (పీఐసీ)ని నియమించారు. ఈ మేరకు కిమిడి నాగార్జున ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. పీఏసీఎస్‌లకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడంతో అన్ని వ్యవసాయ పరపతి సంఘాలకు త్రీ సభ్య కమిటీలను నియమించనున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో వున్న 94 వ్యవసాయ పరపతి సంఘాలకు కమిటీలు రానున్నాయి. ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్న దానిపై ఇప్పటికే ఎమ్మెల్యేలు జాబితాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని వాటిని సిద్ధం చేశారు. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా మారిన సొసైటీలను గాడిన పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో సొసైటీల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలనుకుంటోంది. 2019 నుంచి 2024 వరకూ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేసుకుంటూ వచ్చింది. దీంతో సొసైటీల్లో పాలన గాడితప్పింది.
త్రిసభ్య కమిటీలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నియమించనున్న త్రీ సభ్య కమిటీలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేయనున్న నిబంధనల్లో ప్రతి పీఏసీఎస్‌కి ఒక చైర్‌పర్సన్‌, ఇద్దరు సభ్యులు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ల సీఈఓ, కార్యదర్శులు పనిచేస్తారు. ఎన్నికలు జరిగే వరకూ సహకార సంఘాలకు త్రీ సభ్య కమిటీలే కొనసాగనున్నాయి. ఇప్పటికే రెండు, మూడు దశల్లో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేసిన ప్రభుత్వం. తాజాగా పీఏసీఎస్‌లకు త్రిసభ్య కమిటీలు నియమించడం ద్వారా మరోసారి పదవుల పందేరానికి సిద్ధమవుతోంది. ఈ నెలలోనే కమిటీలు కొలువుతీరనున్నాయి.

Updated Date - Jun 30 , 2025 | 11:48 PM