Quarry accident : క్వారీలో ఏమైంది?
ABN , Publish Date - May 17 , 2025 | 12:34 AM
Quarry accident.. Suspicious deaths మెళియాపుట్టి మండలం దీనబందుపురం సమీపాన దబ్బగూడ రెవెన్యూ పరిధిలోని మనీషా కూనపురెడ్డికి చెందిన వీఆర్‌టీ గ్రానైట్ క్వారీలో ముగ్గురు కార్మికులు శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన తిర్గంగి రామారావు(40), బడబంద అప్పన్న(35)తోపాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఉంగవేణు అర్ముగం(45) అనే మేస్త్రీ రోజూ మాదిరి శుక్రవారం ఉదయం క్వారీలో విధులకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో పిడుగుపడి ఆ ముగ్గురూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు క్వారీ యజమాని సమాచారం ఇచ్చారు.
అనుమానాస్పద స్థితిలో ముగ్గురు కార్మికుల మృతి
పిడుగుపడి ప్రాణాలు కోల్పోయారన్న గ్రానైట్ యాజమాని
బాంబు పేలి మృతి చెందారని కుటుంబ సభ్యుల ఆరోపణ
ఇరువర్గాల మధ్య వాగ్వాదం
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మెళియాపుట్టి/ టెక్కలి, మే 16(ఆంధ్రజ్యోతి): ఆ ముగ్గురు కార్మికులు రోజూ మాదిరి.. శుక్రవారం ఉదయం క్వారీలో విధులకు హాజరయ్యారు. సాయంత్రం వేళ ఆ ముగ్గురూ పిడుగుపడి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు క్వారీ యాజమాన్యం నుంచి సమాచారం అందింది. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చేలోపే కొండపై నుంచి ఆ మృతదేహాలకు వ్యాన్‌లో కిందకు దించేయడంతో ఈ ఘటనపై అనుమానాలు తలెత్తాయి. క్వారీలో బాంబు బ్లాస్టింగ్ వల్లే ఆ ముగ్గురూ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అసలు క్వారీలో ఏమి జరిగిందో చెప్పాలంటూ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మెళియాపుట్టి మండలం దీనబందుపురం సమీపాన దబ్బగూడ రెవెన్యూ పరిధిలోని మనీషా కూనపురెడ్డికి చెందిన వీఆర్‌టీ గ్రానైట్ క్వారీలో ముగ్గురు కార్మికులు శుక్రవారం అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. టెక్కలి మండలం పోలవరం గ్రామానికి చెందిన తిర్గంగి రామారావు(40), బడబంద అప్పన్న(35)తోపాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఉంగవేణు అర్ముగం(45) అనే మేస్త్రీ రోజూ మాదిరి శుక్రవారం ఉదయం క్వారీలో విధులకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం చీకటి పడుతున్న సమయంలో పిడుగుపడి ఆ ముగ్గురూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు క్వారీ యజమాని సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు క్వారీ వద్దకు వచ్చేలోపు మృతదేహాలను ఒక వ్యాన్‌లో వేసి కొండపై నుంచి కిందకు దింపేశారు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గ్రానైట్ యజమానితో వాగ్వాదానికి దిగారు. పిడుగు పడి వారు మృతి చెందలేదని, బాంబు బ్లాస్టింగ్ అయి ప్రాణాలు కోల్పయి ఉంటారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పాతపట్నం సీఐ రామారావు, ఎస్‌ఐ రమేష్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను సముదాయించారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత ఘటన ఎలా జరిగిందో తెలుస్తుందని వారికి నచ్చజెప్పారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అనుమానాలెన్నో..
పిడుగు పడి మృతి చెందితే శరీర భాగాలు విడిపోవు. కానీ ఆ ముగ్గురి మృతదేహాలు ఛిద్రంగా కనిపించడంతో ఈ ఘటన ఎలా జరిగిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పిడుగు పడి మృతి చెందితే.. పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. కానీ అలా కాకుండా మృతదేహాలను కుటుంబ సభ్యులు రాకముందే కొండపై నుంచి కిందకు దించడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ క్వారీల్లో రాయిని విడగొట్టేందుకు కొన్ని సందర్భాల్లో బాంబులు అమర్చి పేల్చుతుంటారు. బాంబు బ్లాస్ట్ అయ్యే సమయంలో పక్కనే ఉన్న ఈ ముగ్గురికీ రాళ్లు తగిలి మృతి చెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఛిద్రమైన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఉపాధి కోసం క్వారీకి వెళితే.. కానరాని లోకాలకు తరలిపోయారంటూ రోదించారు. ఇక తమకు దిక్కెవరని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనతో పోలవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఉలిక్కిపడిన పోలవరం
గ్రానైట్ క్వారీలో ముగ్గురు మృతి చెందడంతో టెక్కలి మండలం పోలవరం గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. అప్పన్న, రామారావు పోలవరానికి చెందిన వారు కావడంతో గ్రామస్థులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. పిడుగుపాటుతో ఇద్దరు మృతిచెందారని సమాచారం అందడంతో సర్పంచ్ గురువెల్లి చిన్నమనాయుడుతోపాటు పలువురు గ్రామస్థులు క్వారీ ప్రాంతానికి చేరుకోగా.. మృతదేహాలు చెల్లాచెదురుగా పడివుండడం గుర్తించారు. మృతుడు తిర్లంగి రాము స్వగ్రామం పోలవరం అయినా తన బావమరిది ఇల్లు కోటబొమ్మాళి ప్రకాష్‌నగర్ కాలనీలో ఉంటున్నాడు. అక్కడ నుంచి క్వారీకి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు రాముకు భార్య లక్ష్మి, కుమారులు సంతోష్, జగదీష్ ఉన్నారు. ఇక పోలవరం గ్రామం రజకవీధికి చెందిన అప్పన్నకు భార్య మంగమ్మతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రం తిరుమన్నావలై సెంజి గ్రామానికి చెందిన అర్ముగంకు భార్య జయంతి, కుమారుడు దినేష్ ఉన్నారు. వీరంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.