Share News

Gas subsidy: మూడు విడతలు.. ఒకేసారి

ABN , Publish Date - May 16 , 2025 | 12:12 AM

Simultaneous Implementation జిల్లాలో చాలామంది వినియోగదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ డబ్బులు జమకాక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల ఉచిత సిలిండర్ల డబ్బులను ఒకేసారి.. అదీ ముందుగానే వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. దీంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Gas subsidy: మూడు విడతలు.. ఒకేసారి

ఇకపై ముందుగానే గ్యాస్‌ సిలిండర్ల రాయితీ డబ్బులు జమ

పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం

లబ్ధిదారులకు తప్పనున్న ఇబ్బందులు

మెళియాపుట్టి మండలం పెద్దపద్మాపురం గ్రామానికి చెందిన బైపోతు సావిత్రమ్మకు గ్యాస్‌ కనెక్షన్‌ ఉంది. అన్ని అర్హతలు ఉన్నా.. ప్రభుత్వం ప్రకటించే ఉచిత సిలిండర్‌కు సంబంధించి తొలివిడత రాయితీ డబ్బులు ఆమె బ్యాంకు ఖాతాకు జమ కాలేదు. దీంతో గ్యాస్‌ కార్యాలయంతోపాటు బ్యాంకులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.

.........

మెళియాపుట్టి మండలం జలగలింగుపురానికి చెందిన నడిమింటి సరోజిని కి కూడా మొదటి విడత గ్యాస్‌ రాయితీ డబ్బులు జమ కాలేదు. గ్యాస్‌ ఏజెన్సీకి, బ్యాంకు వద్దకు వెళ్లి అడిగినా సమస్య పరిష్కారం కాలేదు. రాయితీ డబ్బులు పడకపోవడంతో ఆమె దిగులు చెందుతోంది.

మెళియాపుట్టి, మే 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలామంది వినియోగదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ డబ్బులు జమకాక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల ఉచిత సిలిండర్ల డబ్బులను ఒకేసారి.. అదీ ముందుగానే వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. దీంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లో దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు గతేడాది నవంబరు 1న ఇచ్ఛాపురం నియోజకవర్గం ఈదుపురంలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు తొలివిడత కింద వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో సిలిండర్‌ రాయితీ డబ్బులు జమ చేశారు. కాగా.. సాంకేతిక ఇబ్బందుల కారణంగా చాలామంది వినియోగదారుల ఖాతాల్లో తొలివిడత రాయితీ డబ్బులు జమకాలేదు. జిల్లాలో 6,92,825 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. తొలివిడత రాయితీ 4,35,992 మందికి మాత్రమే రూ.33.31 కోట్లు జమయినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 2.30 లక్షల మందికి మాత్రమే రాయితీ అందినట్టు తెలుస్తోంది. మిగిలిన వారంతా రాయితీ డబ్బులు జమకాక నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పొలిట్‌బ్యూరో సభ్యుల సమావేశంలో దీనిపై చర్చించారు. ఇకపై గ్యాస్‌ వినియోగదారుల జాబితా ప్రకారం ముందుగానే ఏడాదికి సంబంధించి మూడు సిలిండర్ల డబ్బులను ఒకేసారి రూ.2,488 చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్‌ నుంచి జూలై, ఆగస్టు నుంచి నవంబరు, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడు విడతలుగా విభజించి ఉచితంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. రాయితీ డబ్బులు ముందుగానే జమచేయనుండడంతో అర్హులైన లబ్ధిదారులందరికీ మేలు జరగనుంది.

సాంకేతిక సమస్య పరిష్కరించాలి

వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది వినియోగదారులు గ్యాస్‌ కార్యాలయాల వద్ద ఈకేవైసీ ప్రక్రియ నమోదు చేయించుకోలేదు. దీంతో అర్హత ఉన్నా.. రాయితీ డబ్బులు జమకావడం లేదు. ఈ నేపథ్యంలో సచివాలయ అధికారులకు బయోమెట్రిక్‌ అమలు బాధ్యత అప్పగిస్తే.. వృద్ధులైన చాలామంది వినియోగదారులకు ఉపశమనం లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో వివిధ సాంకేతిక కారణాలతో చాలామంది రాయితీకి దూరమయ్యారు. ఆ సాంకేతిక సమస్యలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. రాయితీ అందనివారి నుంచి దరఖాస్తులు స్వీకరించి.. సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - May 16 , 2025 | 12:12 AM