Share News

ASHA workers : నెరవేరిన ‘ఆశ’

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:42 PM

Three promises made to ASHA workers ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం వరాలు ప్రకటించింది. కొన్నాళ్లుగా వారు డిమాండ్‌ చేస్తున్న మూడు హామీలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రసూతి సెలవులను 180 రోజులు ప్రకటించింది. తొలి, రెండో ప్రసవాలకు మూడేసి నెలలు చొప్పున వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయనుంది.

 ASHA workers : నెరవేరిన ‘ఆశ’
ఇచ్ఛాపురం సీహెచ్‌సీలో ఆశావర్కర్లు(ఫైల్‌)

  • ఆశా కార్యకర్తలకు మూడు వరాలు

  • ప్రసూతి సెలవులు, గ్రాట్యూటీ మంజూరు

  • 62 ఏళ్లకు పదవీ విరమణ పెంపు

  • ప్రభుత్వ నిర్ణయంపై హర్షం

  • ఇచ్ఛాపురం, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం వరాలు ప్రకటించింది. కొన్నాళ్లుగా వారు డిమాండ్‌ చేస్తున్న మూడు హామీలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రసూతి సెలవులను 180 రోజులు ప్రకటించింది. తొలి, రెండో ప్రసవాలకు మూడేసి నెలలు చొప్పున వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయనుంది. అలాగే సర్వీసు పూర్తిచేసుకున్న వారికి గ్రాట్యూటీని రూ.1.50లక్షలు ఇచ్చేందుకు నిర్ణయించింది. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 2,785 మంది ఆశా కార్యకర్తలకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం వీరికి గౌరవ వేతనంగా నెలకు రూ.10వేలు అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమానంగా గ్రామస్థాయిలో ఆరోగ్యపరంగా ఆశా కార్యకర్తలు సేవలందిస్తున్నారు. వైసీపీ పాలనలో ఆశా కార్యకర్తలపై తీవ్ర నిర్లక్ష్యం కొనసాగింది. 2019 ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారు. ఉద్యోగ భద్రత లేదు. సమాన పనికి సమాన వేతనం లేదు. ఆపై కరోనాలాంటి కష్టకాలంలో సేవలందించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ముందు ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీను సైతం నిలిపివేశారు. దీంతో ఆశాకార్యకర్తలు ఆందోళన చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమమంలో.. తాము అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ప్రసూతి సెలవు, గ్రాట్యూటీ, పదవీ విరమణ వయసు పెంపు అమలు చేయనున్నట్టు ప్రకటించడంతో ఆశా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ గౌరవ వేతనాన్ని కూడా పెంచాలని కొంతమంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

  • ప్రభుత్వానికి కృతజ్ఞతలు

  • దశాబ్దాలుగా వెట్టి చాకిరీ చేస్తున్నాం. కరోనాలాంటి కష్టకాలంలో కూడా సేవలందించాం. వైసీపీ సర్కారు మాటలతో కాలం గడిపేసింది. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేకపోయింది. మా సమస్యలను గుర్తించి.. పరిష్కారానికి చొరవ చూపిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

    - ఇందిర, ఆశా కార్యకర్త, ఇచ్ఛాపురం

Updated Date - Aug 16 , 2025 | 11:42 PM