వ్యాపారి కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:02 AM
ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన పలాస జీడి వ్యాపారి, వివిధ బ్యాంకుల కన్సల్టెంట్ వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు (వీఎల్‌ఎన్ రాజు) కిడ్నాప్ కేసుకు సంబంధించి ముగ్గురుని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నలుగురుని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏఎస్పీ (క్రైం) పి.శ్రీనివాసరావు తెలిపారు.
పరారీలో మరో నలుగురు
వివరాలు వెల్లడించి ఏఎస్పీ (క్రైం) శ్రీనివాసరావు
పలాస, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన పలాస జీడి వ్యాపారి, వివిధ బ్యాంకుల కన్సల్టెంట్ వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు (వీఎల్‌ఎన్ రాజు) కిడ్నాప్ కేసుకు సంబంధించి ముగ్గురుని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో నలుగురుని త్వరలోనే అరెస్టు చేస్తామని ఏఎస్పీ (క్రైం) పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో ఆయన విలేకరులకు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యాపారవేత్త వీఎల్‌ఎన్ రాజు స్వగ్రామమైన అమదాలవలస మున్సిపాలిటిలో కమర్షియల్ భవంతి ఉంది. దీన్ని అదే ప్రాంతానికి చెందిన వ్యాపారి పొట్నూరు వేణుగోపాలరావుకు లీజుకు ఇచ్చారు. దీనిలో వేణుగోపాలరావుతోపాటు తన కుటుంబ సభ్యులతో కలిసి కామేశ్వరి సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. అయితే వీఎల్‌ఎన్ రాజు బ్యాంకులో చేసిన అప్పు తిరిగి సకాలంలో చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో భవనాన్ని సీజ్ చేసేందుకు బ్యాంకు అధికారులు రాజుకి నోటీసులు జారీ చేశారు. దీనికి వేణుగోపాలరావు భవన యజమాని రాజుకు రూ.1.10 కోట్లు ఇవ్వగా బ్యాంకు అప్పు తీర్చేశాడు. అనంతరం సూపర్‌మార్కెట్ భవనాన్ని తనఖా రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ వివాదం సద్ధుమణిగింది. వేణుగోపాలరావుకు తిరిగి నగదు ఇవ్వడంలో జాప్యం జరగడం, ఆ స్థలాన్ని వేరేవారికి అమ్మడానికి రాజు యత్నిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేణుగోపాలరావు ఆ భవనాన్ని ఏ విధంగానైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బొడ్డేపల్లి శ్రీనివాసరావు, అలమండ తాతారావు, పొట్నూరు జీవన్‌కుమార్, రమేష్, గణేష్‌తో పాటు కారు డ్రైవరు.. ఇలా ఏడుగురు కలిసి రెండు కార్లులో రాజును కిడ్నాప్ చేసేందుకు ఈ నెల 6న పలాస వెళ్లారు. ఆ రోజు ఉదయం 9 గంటల సమయంలో కేటీ రోడ్డు, విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టీ తాగుతున్నారు. ఆమదాలవసలకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీఎల్‌ఎన్ రాజును బయటకు రావాలని పిలిచాడు. అప్పటికే రోడ్డుపై వేణుగోపాలరావు తనవారితో కలిసి రెండు కార్లతో రెడీగా ఉన్నారు. వీఎల్‌ఎన్ రాజు బయటకు రాగానే బలవంతంగా ఆయన్ను కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో రాజుపై దాడి చేశారు. ఐరన్ రాడ్డుతో కొట్టడంతో కాలిపై గాయమైంది. ఈ విషయం రాజు భార్య మాధవికి స్థానికులు చెప్పడంతో పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ అప్రమత్తమై కిడ్నాప్‌కు పాల్పడిన వేణుగోపాలరావుకు ఫోన్ చేసి విడిచిపెట్టాలని హెచ్చరించడంతో రాజును ఆమదాలవలస ఎఫ్‌సీ గోదాం వద్ద వదిలి పరారీ అయ్యారు. అనంతరం వీఎల్‌ఎన్ రాజు కాశీబుగ్గ వచ్చి పోలీసులకు జరిగిన విషయాన్ని, తనకు పెట్టిన ఇబ్బందులను పోలీసులకు తెలియజేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీఎస్పీ డి.లక్ష్మణరావు, సీఐ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ ఆర్.నర్సింహమూర్తితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి పలాస బస్టాండ్ వద్ద పొట్నూరు వేణుగోపాలరావు, అలమండ తాతారావు, పొట్నూరు జీవన్‌కుమార్‌లను అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో కారు డ్రైవరుతో సహా నలుగుర్ని అరెస్టు చేయాల్సి ఉందని ఏఎస్పీ వివరించారు. నిందితులను పలాస కోర్టులో హాజరు పరచనున్నట్టు తెలిపారు.