వేలమంది.. ఒకటే క్యూలైన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:09 AM
Stampede at Kasibugga Venkateswara Temple పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
సమాచారం ఇవ్వలే.. వలంటీర్లూ లేరు
ముందుస్తు ఏర్పాట్లు చేయక ఘోరం
కాశీబుగ్గ వెంకటేశ్వరాలయంలో తొక్కిసలాట
9 మంది మృతి.. మృతుల్లో బాలుడు..
17 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
హుటాహుటిన స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
బాధితులకు మంత్రుల బృందం పరామర్శ
మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు భరోసా
పరిహారం ప్రకటించిన మంత్రి నారా లోకేష్
కార్తీకమాసం రెండో శనివారం. ఏకాదశి పర్వదినం. అందరిలోనూ స్వామిని దర్శనం చేసుకోవాలన్న ఆత్రుత. ఒకటే క్యూలైన్ అయినా గంటల తరబడి నిల్చున్నారు. ఐదారువేలు అనుకుంటే 25వేల మంది వచ్చారు. ఉదయం నుంచి దర్శనం సాఫీగానే సాగింది. మధ్యాహ్నం 12.05 గంటల సమయం.. ఉన్నట్లుండి రెయిలింగ్ ఊడిపోయింది. అంతే.. ఒకరిమీద ఒకరు పడ్డారు. తోసుకున్నారు. భయంతో పరుగులు తీశారు. ఎటుచూసినా అరుపులు, కేకలు. పది నిమిషాల తర్వాత ఆ ప్రాంతం భయానకంగా కనిపించింది. చెల్లాచెదురుగా మహిళల మృతదేహాలు.. క్షతగాత్రుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శ్రీకాకుళం/పలాస, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మంత్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. పరిహారం ప్రకటించడంతో పాటు... బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో కాశీబుగ్గ పరిధిలో శ్రీనివాసనగర్‌లో హరి ముకుందపండా అనే వ్యక్తి సొంతంగా శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఏడాదిన్నర క్రితం నిర్మించారు. ఆలయం పూర్తిగా ప్రైవేటు పరిధి కావడంతో.. ఏ ఒక్కరి పర్యవేక్షణ.. పరిశీలన ఉండదాయె. అయితే కార్తీకమాసం... ఏకాదశి సందర్భంగా శ్రీవేంకటేశ్వరున్ని దర్శించుకోవడం జిల్లా ప్రజలకు ఆనవాయితీ. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం చిన తిరుపతిగా పేరుగాంచింది. దీంతో మహిళలు శనివారం వేలాదిగా ప్రైవేటు వాహనాల్లోనూ, ఆర్టీసీ బస్సులలోనూ, ద్విచక్రవాహనాల్లోనూ తరలివచ్చారు. అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టలేదు. ఈ విషయాన్ని భక్తులు కూడా గమనించలేదు.
ఆలయ ప్రధాన గేటు వద్ద తొక్కిసలాట
ఆలయంలోకి ప్రవేశించే వారికోసం, తిరిగి వచ్చేవారికోసం ఆలయ ప్రధాన గేటు వద్ద స్టీల్ బ్యారక్‌లను ఏర్పాటుచేశారు. అదే ప్రాంతంలో మధ్యాహ్నం వేలాదిగా భక్తుల తాకిడితో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. భక్తులను నియంత్రించి.. రద్దీ లేకుండా క్యూలైన్లలో పంపించేందుకుగాను.. అక్కడ ఆలయ సిబ్బంది ఎవరూ లేరు. దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న లైన్.. ఇటునుంచి ఆలయంలోకి భక్తులు వెళ్తున్న బ్యారక్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆలయం లోపల నుంచి వచ్చే బ్యారక్ వద్ద.. ఇటు నుంచి జనాలు చొచ్చుకుని పోవడంతో మహిళలు ఊపిరాడక బిగ్గరగా అరిచారు. రెయిలింగ్ విరిగిపోయింది. మహిళల చేతుల్లో ఉన్న పూజాసామగ్రి చిందరవందరగా పడిపోయింది. మెట్లపై కాళ్లకింద పలువురు మహిళలు పడిపోయి ఊపిరాడక ఏకంగా తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇందులో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని శ్రీకాకుళం తరలించారు. మరో 15 మంది గాయాలపాలయ్యారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 25వేల మంది భక్తులు ఆలయానికి వచ్చిఉంటారని అంచనా. పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం.. వేల సంఖ్యలో మహిళలు రావడం.. పూర్తిగా ప్రైవేటు ఆలయం కావడంతో అధికార యంత్రాంగం కూడా ప్రమాదాన్ని అంచనా వేయలేకపోయింది. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు కూడా లేవు. వలంటీర్లను సైతం నియమించుకోక పోవడం ఘటనకు కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది.
పరామర్శించిన మంత్రులు
వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులతో.. వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. పలాసలో ఆసుపత్రి వద్ద రోదిస్తున్న మృతుల బంధువులను ఓదార్చారు. దేవాలయం వద్ద తొక్కిసలాటకు గల కారణాలు.. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దేవాలయాన్ని నిర్మించిన ప్రైవేటు ట్రస్టు యజమాని హరిముకుంద పండాతో మాట్లాడారు. ఆలయంలోకి వేలాది మంది భక్తులు వస్తుంటే రక్షణ పెట్టుకోకుంటే ఎలాఅని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రంలో ఉన్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తన పర్యటనను రద్దుచేసుకుని శ్రీకాకుళం వచ్చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలసి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.
తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు
కాశీబుగ్గలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై.. అలాగే తొమ్మిది మంది మృతి.. పలువురికి తీవ్రగాయాలపాలవ్వడంపై కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై త్రిసభ్య కమిటీ విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చర్యలు తీసుకున్నారు. మృతదేహాల పోస్టుమార్టం పూర్తిచేయించి మంత్రుల సమక్షంలోనే బాధిత కుటుంబాలకు అప్పగించారు.
పలాస-కాశీబుగ్గలో హై అలెర్ట్..
ఉత్తరాంధ్రకు చెందిన పోలీసు బృందం కొంత సమయం వ్యవధిలో పలాస కాశీబుగ్గకు చేరుకున్నారు. జంట పట్టణాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వరరెడ్డి, విశాఖ, విజయనగరం జిల్లాల ఏఎస్పీలు, డీఎస్పీలు.. ఇంటెలిజెన్స్ పోలీసులు, ఇతర విభాగాల కీలక పోలీసులు.. ప్రత్యేక పోలీసులు కాశీబుగ్గలో మొహరించారు. అసాంఘిక శక్తులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు. మృతుల పోస్టుమార్టం పూర్తిచేయించడంతోపాటు.. ప్రత్యేక వాహనాల్లో స్వగ్రామాలకు తరలించారు. అలాగే అంబులెన్స్‌లో క్షతగాత్రులను తీసకువెళ్లేటప్పుడు పోలీసులు కూడా వెంటవెళ్లారు.
పలువురి పరామర్శ...
క్షతగాత్రులను.. అలాగే మృతుల కుటుంబాలను ప్రముఖులు పరామర్శించారు. ఇందులో మాజీమంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గౌతు శిరీష, గొండు శంకర్, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ... తదితరులు పరామర్శించారు.
రెండున్నర గంటలు ఇక్కడే లోకేష్
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. హుటాహుటిన విశాఖపట్నం వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గాన పలాసకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8-30 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. ఆలయం లోపలకు వెళ్లి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. తాను ఉన్నానంటూ భరోసా కల్పించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15లక్షలు, కేంద్రప్రభుత్వం రూ. 2లక్షలు కలిపి మొత్తం రూ. 17 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని లోకేష్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్రం నుంచి రూ. 3లక్షలు, కేంద్రం నుంచి రూ. 50వేలు కలిపి మొత్తం రూ. 3.5 లక్షలు ఇస్తామన్నారు. మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద తక్షణ సహాయంగా రూ. 10వేలు ఇస్తామన్నారు. మృతుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు బీమా కింద ఒక్కొక్కరికి అదనంగా రూ. 5లక్షల చొప్పున అందుతుందని వెల్లడించారు. హోం మంత్రి వి.అనిత కూడా పలాసకు వచ్చారు.