Share News

ఈ సారు వారానికి ఒక్కసారే వస్తారు

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:48 PM

Deputy MPDO irregular ఆయన డిప్యూటీ ఎంపీడీవో. వారంలో ఒకరోజే ఆఫీసుకు వస్తారు. సంతకాలన్నీ ఆరోజే చేస్తారు. ఎందుకని అడిగితే తాను ఓ అధికారపార్టీ ప్రజాప్రతినిధి పీఏగా వెళ్తున్నానని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఈ ఉత్తర్వులు రాలేదు. కానీ పీఏ పేరిట విధులకు హాజరు కావడం లేదు.

ఈ సారు వారానికి ఒక్కసారే వస్తారు
సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం

అధికారపార్టీ నేత పీఏనంటూ కారణాలు

సంతబొమ్మాళి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ఆయన డిప్యూటీ ఎంపీడీవో. వారంలో ఒకరోజే ఆఫీసుకు వస్తారు. సంతకాలన్నీ ఆరోజే చేస్తారు. ఎందుకని అడిగితే తాను ఓ అధికారపార్టీ ప్రజాప్రతినిధి పీఏగా వెళ్తున్నానని చెబుతున్నారు. అయితే అధికారికంగా ఈ ఉత్తర్వులు రాలేదు. కానీ పీఏ పేరిట విధులకు హాజరు కావడం లేదు. సంతబొమ్మాళి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో పద్మజ ఇటీవల బదిలీపై లావేరు మండలానికి వెళ్లిపోయారు. ఆమె స్థానంలో పాతపట్నం నుంచి వెంకటరావు డిప్యూటీ ఎంపీడీవోగా విధుల్లో చేరారు. ఆయన దురుసుగా ప్రవర్తిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులంతా ఆరోపించగా.. 15 రోజుల్లో మళ్లీ బదిలీపై ఇచ్ఛాపురం వెళ్లిపోయారు. దీంతో పదోన్నతిపై యు.సత్యనారాయణ డిప్యూటీ ఎంపీడీవోగా జూలై 15న సంతబొమ్మాళిలో చేరారు. కానీ ఆయన సక్రమంగా విధులకు హాజరుకావడం లేదు. వారానికి ఒక్కసారి వచ్చి.. హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని కొంతమంది సిబ్బంది చెబుతున్నారు. బుధవారం మండలంలోని ఇజ్జవరంలో ఆర్‌.ఆర్‌.కాలనీకి సంబంధించి విచారణకు డిప్యూటీ ఎంపీడీవో హాజరై.. మండల పరిషత్‌ హాజరు రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెంటనే వెళ్లిపోయారని పేర్కొంటున్నారు. ‘జిల్లాలోని అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్నాను. త్వరలోనే డిప్యుటేషన్‌పై వెళ్లిపోతాను’ అని చెప్పి మండల పరిషత్‌లో రోజువారీ విధులకు గైర్హాజరవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ అండదండలు ఉండడంతో మండల పరిషత్‌ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఆయన విషయంలో తమకెందుకులే అన్న చందంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

కార్యాలయంలో పనులు చక్కబెట్టేందుకు ఆరికవలస పంచాయతీ కార్యదర్శి సిద్దార్థ.. ఇన్‌చార్జి డిప్యూటీ ఎంపీడీవోగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల సంతబొమ్మాళి మండలంలో బోరుభద్ర, ఉమిలాడ, తాళ్లవలసలోని ఉపాధిహామీ, వెలుగు పనులను కేంద్ర ఎన్‌ఎల్‌ఎం బృందం పరిశీలించింది. ఆ సమయంలో కూడా డిప్యూటీ ఎంపీడీవోగా సిద్దార్థ హాజరయ్యారు. ఈ విషయమై ఎంపీడీవో జయంత్‌ ప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా.. ‘డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ జిల్లాలో ఓ రాజకీయ నాయకుడి వద్ద పీఏగా డిప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నానని చెప్పారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్‌ పెండింగ్‌లో ఉందంటున్నారు. అందువల్ల డిప్యూటీ ఎంపీడీవో వ్యవహారాల కోసం పంచాయతీ కార్యదర్శి సిద్దార్థను ఇన్‌చార్జిగా నియమించాం. అప్పుడప్పుడూ డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ విధులకు వచ్చి వెళ్తున్నార’ని తెలిపారు.

Updated Date - Aug 22 , 2025 | 11:48 PM