vegetabel tenders: ఇది బహిరంగ దోపిడీ!
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:11 AM
There is a big difference in vegetable tenders ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో అధికారుల తీరు అక్రమాలకు ఊతమిచ్చేలా ఉంది. పౌష్టికాహారానికి సంబంధించి కూరగాయల సరఫరాకు టెండర్ల ఖరారు వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
కాగితాల్లోనే.. సోషల్‌వెల్ఫేర్ విద్యార్థులకు పోషకాహారం
కూరగాయల టెండర్ల విషయంలో ఎంతో వ్యత్యాసం
జిల్లాలో 29 రకాలు రూ.405కే ఖరారు
పార్వతీపురం మన్యం జిల్లాలో అవే దినుసులు రూ.969కి ఆమోదం
తక్కువ ధరతో నాణ్యమైన భోజనం సాధ్యమేనా?
అధికారుల తీరుపై విమర్శలు
శ్రీకాకుళం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు అందించాల్సిన భోజనం విషయంలో అధికారుల తీరు అక్రమాలకు ఊతమిచ్చేలా ఉంది. పౌష్టికాహారానికి సంబంధించి కూరగాయల సరఫరాకు టెండర్ల ఖరారు వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రైతుల వద్దకు వెళ్లి తెచ్చుకున్నా సాధ్యంకాని ధరలకు కాంట్రాక్టర్ టెండర్లు వేయగా.. వాటిని పరిశీలించకుండానే అధికారులు ఆమోదించడం చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళితే.. అన్నివర్గాల పిల్లలకు విద్యాబోధనతోపాటు వసతి, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కేటగిరిల వారీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల హాస్టళ్లు 9 ఉన్నాయి. ఇందులో విద్యార్థులకు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ప్రభుత్వం సీజనల్‌వారీ లభ్యమయ్యే పండ్లతోపాటు.. ఆకుకూరలు, కూరగాయలతో భోజనం అందిస్తోంది. రోజుకి పాఠశాల విద్యార్థికి రూ.45చొప్పున, కళాశాల విద్యార్థికి రూ.55చొప్పున సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా వెచ్చిస్తోంది. విద్యార్థులకు అవసరమైన బియ్యం సరఫరా చేస్తుంది. మిగిలిన కూరగాయలు, ఆకుకూరలు, నిత్యావసరాలను ‘జిల్లా కొనుగోలు సంఘం’ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుని.. టెండర్లను పిలుస్తారు. వెండర్‌ను ఎంపిక చేసి.. వారి ద్వారా సరుకులను సమకూరుస్తారు. అందుకుగాను కాంట్రాక్టరు, కళాశాల, స్కూల్ ప్రిన్సిపాల్ ఇచ్చిన జాబితా ఆధారంగా నెలవారీ సరుకులకు వెచ్చించిన మొత్తాన్ని బిల్లుల రూపంలో చెల్లిస్తారు. అయితే జిల్లాలో మాత్రం అధికారులు ఆచరణకు సాధ్యంకాని విధంగా సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలలకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల సరఫరాకు ధరలు ఖరారు చేస్తూ వెండర్‌కు రెండు నెలల కిందట అనుమతి పత్రాన్ని ఇచ్చేశారు. ఒక్కో హాస్టల్‌కు 29రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఒక కొబ్బరికాయను కేవలం రూ.405కే సరఫరా చేస్తామని టెండర్ వేసిన వ్యక్తికి కేటాయించేశారు. ఇందులో చాలా కూరగాయలు కిలో కేవలం రూ.15కే సరఫరా చేస్తామని చెప్పడం.. అధికారులు టెండర్ ఖరారు చేయడం గమనార్హం. పక్కనే ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహ విద్యార్థులకు ఇవే కూరగాయలు, ఆకుకూరలను సరఫరా చేసేందుకు రూ. 969కు ఆమోదం లభించింది. అక్కడ ‘జిల్లా కొనుగోలు సంఘం’ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత రేట్లను ఖరారుచేశారు. ఇక పండ్ల విషయానికొస్తే నాసిరకం కూడా లభించని ధర ఇక్కడ అగ్రిమెంట్‌లో ఉంది. కాంట్రాక్టర్ మార్కెట్‌లో కూరగాయలు, పండ్లను అధిక ధరకు కొనుగోలు చేసి.. విద్యార్థులకు తక్కువ ధరకు సరఫరా చేసే పెద్దమనసు ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ అధికారులు మాత్రం కాంట్రాక్టరు ఇచ్చిన టెండర్‌నే ఆధారం చేసుకోవడం.. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా సంక్షేమం ఎలా అన్న అనుమానం తలెత్తుతోంది. వసతిగృహాల్లో విద్యార్థులకు సరిపడా పండ్లను, వంటకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారా? లేదా అన్నది సందేహం వ్యక్తమవుతోంది. చవకగా ధరలు కాగితాల్లో చూపించి.. క్షేత్రస్థాయిలో మోసాలను.. అక్రమాలను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్ అయినా, నేరుగా రైతు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకున్నా సరే గిట్టుబాటుకాని ధరలను టెండర్‌లో కోట్ చేయడం.. ఖరారు చేసేయడం విడ్డూరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సంఘాల వారీగా టెండర్ల ధరల విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారులకు, మంత్రులకు ఫిర్యాదు చేరినట్లు విశ్వసనీయ సమాచారం.
హాస్టళ్లలో టెండర్ల ధరలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఇలా.. (రూ.ల్లో)
--------------------------------------------------------------------------------------- కూరగాయలు(కిలో) శ్రీకాకుళం మన్యం
-----------------------------------------------------------------------------------------------
బంగాళాదుంప 15 28
వంకాయ 15 25
క్యాబేజీ 15 25
బెండకాయ 15 28
గోరుచిక్కుడు 15 28
చిక్కుడు 15 28
దొండకాయ 15 25
టమోటా 15 28
క్యారెట్ 15 45
ఆనపకాయ 15 24
మునగకాయ 15 32
ముల్లంగి 10 25
కాలీఫ్లవర్ 15 25
అరటికాయ 15 25
ఉల్లిపాయలు 15 33
అల్లం 15 65
నిమ్మకాయ 15 22
వెల్లుల్లి 15 100
పర్చిమిర్చి 15 40
బీట్ రూట్ 15 20
బీన్స్ 15 35
బీరకాయ 15 25
కరివేపాకు 10 35
కొత్తిమీర 10 28
గోంగూర 10 35
చుక్కకూర 10 40
మెంతికూర 10 15
తోటకూర 10 25
పాలకూర 10 40
కొబ్బరికాయ(ఒకటి) 10 20
==========================================
పండ్ల ధరలు.. ఇలా...
==========================================
పసుపు అరటిపండు 20 34
జామ 30 45
యాపిల్ 60 130
స్వీట్ ఆరెంజ్(కమలా) 25 75
పుచ్చకాయ 20 30
దానిమ్మ 60 125
సపోటా 30 45
బొప్పాయి 20 30
ద్రాక్ష 40 100
నారింజ 25 25
మామిడి 30 55