Share News

ఇది కూటమి నేతల పంచాయితీ

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:02 AM

The Etcherlas' Quarrying Controversy అధికారపార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సిన అభివృద్ధి పనులు కన్నా.. పంతానికే ప్రాధాన్యమిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా వైసీపీ నాయకులు, అప్పటి ప్రజాప్రతినిధులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ అప్పట్లో జరిగిన అక్రమాల సంగతి అంతా తేలుస్తామని కూటమి నాయకులు ఎన్నికల ముందు ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయి.. తెరచాటుగా తగాదా పడుతున్నారు.

ఇది కూటమి నేతల పంచాయితీ
ఎచ్చెర్ల నియోజకవర్గంలో వివాదానికి కారణమైన కంకర క్వారీ ఇదే

ఎచ్చెర్లలో క్వారీ విషయమై రాద్ధాంతం

తెరచాటుగా ఇద్దరు ప్రజాప్రతినిధుల తగాదా

అసెంబ్లీకి వరకూ చేరిన వ్యవహారం

వైసీపీ నాయకుల అక్రమాల సంగతి మరచిన వైనం

రాష్ట్రస్థాయిలో రచ్చగా మారిన అంతర్గత పోరు

శ్రీకాకుళం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): అధికారపార్టీకి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రజలకు ఉపయోగపడేలా చేయాల్సిన అభివృద్ధి పనులు కన్నా.. పంతానికే ప్రాధాన్యమిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా వైసీపీ నాయకులు, అప్పటి ప్రజాప్రతినిధులు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ అప్పట్లో జరిగిన అక్రమాల సంగతి అంతా తేలుస్తామని కూటమి నాయకులు ఎన్నికల ముందు ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ఆ సంగతి మరిచిపోయి.. తెరచాటుగా తగాదా పడుతున్నారు. పంతాలకు పోయి.. పరస్పర విమర్శలతో రాష్ట్రస్థాయిలో చర్చగా మారి రచ్చ చేసుకుంటున్నారు.

వైసీపీ హయాంలో క్వారీకి అనుమతి

ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓ క్వారీ విషయమై ఇద్దరు ఎమ్మెల్యేలు నేరుగా కత్తులు పట్టుకోకుండా దెబ్బలాడుకుంటున్నారు. పేర్లు చెప్పుకోకుండా పరోక్షంగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ తాము మంచివారిమని ధ్రువీకరణ ఇచ్చుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ఓ కొండపై గ్రావెల్‌ తవ్వకాలకుగానూ ఓ సంస్థకు అధికారికంగా అనుమతి లభించింది. అప్పుడు ఆ క్వారీపై ఎటువంటి వివాదమూ లేదు. తవ్వకాలూ జరపలేదు. ఎటొచ్చీ.. ప్రస్తుత కూటమికి చెందిన ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు ఈ క్వారీపై పంతాలకు పోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా ఉండేలా వ్యవహరిస్తున్నారు. క్వారీపై కంకర తవ్వకాలను సమీప గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ ప్రజాప్రతినిధి సహకారంతోనే గ్రామస్థులు ఆందోళనలు సైతం చేస్తూ తవ్వకాలను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా వైసీపీ హయాంలో వేరొకరి పేరుతో చేజిక్కుంచుకున్న ఈ క్వారీని ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి పరోక్షంగా నిర్వహిస్తున్నారని అంతటా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఈ క్వారీ కూటమిలో ఇద్దరి ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత పోరుకు దారి తీసింది. ఆ ఇద్దరూ పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ వేదికగా కూడా క్వారీ విషయమై చర్చ సాగడం గమనార్హం. తాము ఏ తప్పూ చేయలేదని.. క్వారీ వివాదంలో వెనకున్నది ఎవరో తేల్చాలంటూ కోరడం విశేషం. ఇదే అవకాశంగా వైసీపీ నేతలు.. వారిద్దరి పనితీరుకు అవినీతి మరక అంటించి వారివంతు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలూ క్వారీ సమస్యను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

‘రెడ్‌బుక్‌’ను మరిచిపోయారు

గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో వైసీపీ ప్రజాప్రతినిధులు చంద్రబాబునాయుడు, లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ.. బూతులతో రెచ్చిపోయారు. ప్రజా ఆస్తులను సైతం లూటీ చేసి.. టీడీపీ నాయకులపై కేసుల మోత మోగించారు. ఇప్పుడు ఎచ్చెర్ల క్వారీ విషయంలో విచారణ జరపాలని కోరుతున్న ప్రజాప్రతినిధే.. వైసీపీ హయాంలో బాధితుడిగా ఉన్నారు. అత్యధికంగా అట్రాసిటీ కేసులు నమోదయ్యేలా వైసీపీ నాయకులు వ్యవహరించారు. ఇక ఇతర నియోజకవర్గాల విషయానికొస్తే.. అప్పటి వైసీపీ నాయకులు తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీనివాస్‌ వంటివారు జిల్లాలో అధికారాన్ని అడ్డబెట్టుకుని అప్పట్లో అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ఆ వైసీపీ నాయకుల పేర్లను ‘రెడ్‌బుక్‌’లో నమోదు చేయించామని ప్రగల్భాలు పలికారు. అధికారంలోకి వచ్చాక వారి సంగతి మరిచిపోయారు. వారు పెట్టిన కేసులనుంచి బెయిల్‌ తీసుకున్నారే కానీ.. అధికారంలోకి వచ్చాక ప్రజలు కోరుకున్నట్లు వ్యవహరించడంలేదు. పోరాడాల్సింది ప్రత్యర్థులతో అన్నది గుర్తుంచుకోకుండా అసెంబ్లీకి వివాదాన్ని తీసుకెళ్లారు. ఇప్పటికైనా వివాదాల నుంచి బయటపడితే కూటమి ప్రజాప్రతినిధులకే మేలు. లేదంటే వైసీపీ నాయకులకు ఇటువంటి తప్పిదాలే ఆయుధాలుగా అందించినట్లవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:02 AM