ఇది 20 ఏళ్ల ఇంటి స్థలాల సమస్య
ABN , Publish Date - Dec 27 , 2025 | 11:09 PM
The solution in the ‘Mee Chetki Mee Bhoomi’ program ప్రభుత్వం చేపట్టిన మీ చేతికి-మీభూమి కార్యక్రమంలో 20 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘మీ చేతికి-మీభూమి’ కార్యక్రమంలో పరిష్కారం
కూటమి ప్రభుత్వానికి స్థానికుల కృతజ్ఞతలు
హిరమండలం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన మీ చేతికి-మీభూమి కార్యక్రమంలో 20 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. హిరమండలంలో పెరికివీధి, గాంధీనగర్ వీధితోపాటు మరికొన్ని వీధుల్లో తరతరాల నుంచి ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వంశధార రిజర్వాయర్ నిర్మాణం కారణంగా 2005 నుంచి 11.72ఎకరాల్లోని ఇళ్లు, స్థలాలు అమ్మకాలు జరిపితే రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఆయా సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు కావడమే దీనికి కారణం. 70,71,66,74 సర్వే నెంబర్లలో భూమిని కొనుగోలు చేసుకునేవారు రిజిస్ర్టేషన్ అవ్వకపోవడంతో స్టాంపు పేపర్లు మీదనే రాసుకునేవారు. ప్రభుత్వం మంజూరుచేసే ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే పొజిషన్ సర్టిఫికెట్లు కూడా అధికారులు ఇచ్చేవారు కాదు. ఈ విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ ప్రాంతం నిషిద్ధ భూముల జాబితా 22ఏ నుంచి తొలగించాలంటూ అధికారులకు విన్నవించేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీ చేతికి-మీభూమి’ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్యర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. దీన్ని కలెక్టర్ మొదటి ప్రాధాన్యత సమస్యగా గుర్తించి ఇకపై ఇళ్ల స్థలాలు, ఇళ్లకు రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు లైన్‌క్లియర్ చేసినట్లు టీడీపీ జడ్పీటీసీ బుచ్చిబాబు తెలిపారు. దీనికి సంబంధించి ఉత్తర్వుల కాపీని కూడా తనకు అందజేసినట్లు చెప్పారు. దీంతో హిరమండలం వాసులు కూటమి ప్రభుత్వానికి, మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.