Land dispute: మా భూములు ఖాళీ చేయాలంట!
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:48 PM
Farmer protests తామంతా తరతరాలుగా జీడి తోటలు సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఓ ప్రభుత్వ ఉద్యోగి తమ భూములను ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ 3వ వార్డు పెంటిభద్ర గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఓ ప్రభుత్వ ఉద్యోగి మమ్మల్ని బెదిరిస్తున్నారు
గ్రీవెన్స్ వద్ద పెంటిభద్ర గిరిజనుల ఆవేదన
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 21(ఆంధ్రజ్యోతి): తామంతా తరతరాలుగా జీడి తోటలు సాగుచేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఓ ప్రభుత్వ ఉద్యోగి తమ భూములను ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ 3వ వార్డు పెంటిభద్ర గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘మీకోసం’లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ‘మాకు 1984లో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 295, 296, 297లలో పట్టాలు కూడా జారీ చేసింది. ఈ భూముల్లో సాగు చేస్తున్న జీడి తోటల ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నాం. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ భూములు తన తల్లి పేరున ఉన్నాయని, 1963లోనే పట్టా ఇచ్చారని, వెంటనే ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. రీ సర్వే చేసి సాగుదారులకు పొజిషన్ సర్టిఫికేట్లు మంజూరు చేసి న్యాయం చేయాలి’ అని గిరిజనులు కోరారు.
‘తల్లికి వందనం’ రాలేదు సార్!
మండల పరిషత్ పాఠశాలలో 2,3,4,5 తరగతులు చదువుతున్న మా పిల్లలకు తల్లికి వందనం రాలేదని సింగుపురం పాఠశాల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ‘మీకోసం’లో ఫిర్యాదుచేశారు. 120 మంది విద్యార్థులకు పథకం వర్తించ లేదన్నారు. వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ ద్వారా పరిశీలిస్తే పేర్లు లిస్టులోనే లేవని చూపిస్తోందని వాపోయారు. కూలి పనులు చేసుకుంటే గాని జీవనం సాగదని, ప్రైవేటు పాఠశాలల్లో చదివించుకునే స్తోమత లేదని, అయితే ఎవరు తప్పు చేశారో తెలియదని, మా పిల్లల పేర్లు లిస్టులో లేకపోవడం దారుణమన్నారు. ఈ విషయమై గ్రీవెన్స్‌కు రెండోసారి వచ్చామని, ఇప్పటికైనా న్యాయం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఈవో తిరుమల చైతన్యను వేడుకున్నారు.
వినతులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
‘మీకోసం’లో వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశిం చారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక ‘మీకోసం’ నిర్వహించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ప్రజల నుంచి 80 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలు పరిష్కారం కాకుంటే ఆ సమాచారాన్ని అర్జీదారునికి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.